తమిళనాడులో హిందువుల ప్రార్థనాస్థలాలను మైనారిటీలు ఆక్రమిస్తున్న సందర్భాల నేపథ్యంలో చెన్నయ్‌లోని ప్రఖ్యాత ఆలయం పవిత్రతను దెబ్బతీసే సంఘటన ఒకటి జరిగింది. మైలాపూర్ కపాలీశ్వర స్వామి ఆలయంలో ఓ ముస్లిం మహిళ నమాజు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేయడంతో హిందూసంఘాలు భగ్గుమన్నాయి.
నీలంగరై ప్రాంతానికి చెందిన ఆయేషా బాను అనే మహిళ 2024 ఆగస్టు 24న మైలాపూర్‌లోని ప్రఖ్యాత కపాలీశ్వర స్వామి ఆలయానికి వెళ్ళింది. ఆలయం ఆవరణలో నమాజు చేసింది. తన ముస్లిం ప్రార్థనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేసింది. ముస్లిం మహిళ హిందూ కోవెలలో నమాజు చేసిన దృశ్యాలు వైరల్ అవడంతో హిందూ సంఘాల ఆగ్రహం ఆకాశాన్నంటింది.
తమిళనాడులోని ప్రముఖ హిందూ సంస్థ ‘భారత హిందూ మున్నాని’ ఆ సంఘటనపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది. ఆలయం పవిత్రతను దెబ్బతీసేందుకు, ఉద్దేశపూర్వకంగా హిందువులను రెచ్చగొట్టేందుకే గుడిలో నమాజు చేసారని ఆ సంస్థ మండిపడింది. జరిగిన సంఘటనపై నిష్పాక్షికంగా విచారణ జరిపించాలంటూ హిందూ మున్నాని రాష్ట్ర కార్యదర్శి డిల్లీబాబు తమిళనాడు దేవదాయ శాఖ కమిషనర్‌కు మహజరు సమర్పించారు.
తమిళనాడులో హిందువుల ఆచార సంప్రదాయాలను అవహేళన చేసే సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. పైకి నాస్తికులమని చెప్పుకుంటూ ద్రవిడ భావజాలం మాటున క్రైస్తవులకు, ముస్లిములకు అండగా నిలుస్తూ హిందువులను అణగదొక్కేయడమే విధానంగా పనిచేస్తున్న డిఎంకె ప్రభుత్వం సనాతన ధర్మ నిర్మూలనే లక్ష్యంగా పని చేస్తోంది. అలాంటి తరుణంలో తమిళనాడులోని హిందూ ధార్మిక స్థలాలను అపవిత్రం చేయడం, హిందువుల ధార్మిక ఆచార వ్యవహారాలను అవహేళన చేయడమనే విస్తృతమైన అజెండాలో భాగంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ హిందూ మున్నాని ఆందోళన వ్యక్తం చేసింది.
దేవాలయాల్లోకి హిందూయేతరులు ప్రవేశించడం, తమ మతాలకు చెందిన కార్యకలాపాలకు పాల్పడడం వంటి సంఘటనలు గతంలోనూ జరిగాయి. ఈ యేడాది ఫిబ్రవరిలోనే ఇదే కపాలీశ్వర ఆలయంలో ఒక మహిళ బైబిల్ చదువుతూ దొరికింది. నిజానికి ఇతర మతాలకు చెందిన వ్యక్తులను దేవాలయాల్లో ధ్వజస్తంభం దాటి లోపలికి అనుమతించరాదంటూ మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ కొద్దికాలం క్రితం తీర్పునిచ్చింది. గుడులు బహిరంగ ప్రదేశాలు కావనీ, ఆయా దేవతల భక్తుల కోసం నిర్దిష్టంగా కేటాయించబడిన పవిత్ర ప్రదేశాలనీ, వాటిలోకి ఎవరు పడితే వారు ప్రవేశించకూడదనీ కోర్టు ఖరాఖండిగా తేల్చిచెప్పింది. న్యాయస్థానం అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతుండడం గమనార్హం.
కోర్టు ఉత్తర్వును సరిగ్గా అమలు చేయకపోతుండడానికి కారణం తమిళనాడులో ద్రవిడవాద ప్రభుత్వం అధికారంలో ఉండడమూ, దేవదాయ శాఖ వైఫల్యమే ప్రధాన కారణాలని విమర్శలు ఉన్నాయి. హిందువుల హక్కులు, వారి సంస్కృతి, హిందువుల ప్రార్థనా స్థలాలూ ప్రమాదంలో ఉన్నాయన్న భయాలు మైలాపూర్ కపాలీశ్వర ఆలయంలో తాజా ఘటనతో మరోసారి పెచ్చుమీరాయి.
ఆయేషా బాను నమాజ్ సంఘటనపై బాలమురుగన్ అనే ఆలయోద్యోగి మైలాపూర్ పోలీస్ స్టేషన్లో ఆగస్టు 29న ఫిర్యాదు చేసారు. ఆ ఫిర్యాదును సైబర్‌క్రైమ్ విభాగానికి బదిలీ చేసారు. దాంతో యూట్యూబ్ నుంచి ఆ మహిళ గుడిలో నమాజ్ చేసిన వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించారు. ఆయేషా బానూ చర్యల వెనుక ఉద్దేశాలేమిటో దర్యాప్తు చేయాలని, తగిన న్యాయ చర్యలు తీసుకోవాలనీ భారత హిందూ మున్నాని పోలీసులను కోరింది. ఆ సంఘటనకు సంబంధించిన ఫుటేజ్‌ను గుడిలోని సిసిటివి కెమెరాలు, పోలీసుల నిఘా కెమెరాల నుంచీ సేకరించి, సమీక్ష కోసం భద్రపరచాలని హిందూ మున్నాని కోరింది.
గతేడాది నవంబర్‌లో కార్తీకమాసం సమయంలో మైలాపూర్‌లోని కర్పగాంబాళ్ కోవెలలో హిందూ మున్నాని సభ్యులు పూజ చేసుకుంటూ ‘ఓం నమశ్శివాయ’ మంత్రజపం చేసుకుంటున్నారు. ఆ సమయంలో పోలీసులు గుడిలోకి ప్రవేశించి, ఎవరూ ఎటువంటి ఫిర్యాదూ చేయకపోయినా హిందూ మున్నాని సభ్యులను నిలువరించారు. అదేమిటని ప్రశ్నించినందుకు వారిని అదుపులోకి తీసుకున్నారు. హిందువులు తమ దేవాలయాల్లో తమ దేవతలకు పూజలు చేసుకుంటుంటే వారిని అడ్డుకుంటున్నారు. కానీ హిందువుల దేవాలయాల్లో ఇతర మతాల వారు ప్రవేశించి బైబిల్, ఖురాన్ చదువుతుంటే మాత్రం నోరెత్తడం లేదు. తమిళనాడు ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ద్వంద్వ వైఖరి హిందువుల్లో అసంతృప్తి కలగజేస్తోంది.