హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ, ఆయన క్యాబినెట్‌లోని మంత్రులు తమ వేతనాలు, భత్యాలు తీసుకోడాన్ని రెండు నెలలు వాయిదా వేసుకున్నారు. ఇటీవల ప్రకృతి బీభత్సం కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోయింది. దాంతో మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. మిగతా ఎమ్మెల్యేలు కూడా అలాంటి నిర్ణయం తీసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.
కొన్నినెలలుగా హిమాచల్ ప్రదేశ్ భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో అతలాకుతలం అవుతోంది. దానికి తోడు చాలా ప్రదేశాల్లో కొండచరియలు విరిగి పడిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. కులూ, మండీ, సిమ్లా జిల్లాల్లో ఈ ఆగస్టు నెలలోనే వివిధ ప్రమాదాల్లో సుమారు 30మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఎంతోమంది ఆచూకీ దొరకడం లేదు. జూన్ 27 నుంచి ఆగస్టు 9 వ్యవధిలో భారీ వర్షాలు, సంబంధిత దుర్ఘటనల్లో రాష్ట్రంలో వంద మందికి పైగా చనిపోయారు. గత కొన్ని నెలల్లో జరిగిన ప్రకృతి బీభత్సాల కారణంగా 842 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా.
భారీ వర్షాలు, ఆకస్మిక వర్షాలు-వరదలు, కొండచరియలు విరిగిపడిన ప్రమాదాల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో వంతెనలు, రహదారులు, ఇతర ప్రజారవాణా వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. వాటిని పునర్నిర్మించడానికి భారీగా ఖర్చవుతుంది, చాలా సమయం పడుతుంది.
పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు అయిన హిమాచల్ రాష్ట్రంలో 280 రహదారులు ధ్వంసమయ్యాయి. మంచినీరు, విద్యుత్ సరఫరా కూడా దెబ్బతిన్నాయి. మరోవైపు రాష్ట్ర ఆదాయం కూడా గణనీయంగా తగ్గింది. జిఎస్టి పరిహారం చెల్లింపుల్లో నుంచి కేంద్రం ఇచ్చే వాటాలో రెవెన్యూ లోటు 2500-3500 కోట్లుగా ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. మరోవైపు, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ విధానం – ఓపీఎస్‌ను పునరుద్ధరించిందనీ, దానివల్ల రూ.2వేల కోట్లు అదనపు భారం పడుతోందనీ సీఎం చెప్పుకొచ్చారు.
గతేడాది ఆగస్టులో కూడా వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అయిపోయింది. 72 ఆకస్మిక వరదలు, 168 కొండచరియలు విరిగిపడిన ఘటనలూ నమోదయ్యాయి. సుమారు 3వందల మంది మరణించారు. అప్పుడు సుమారు 10వేల కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేసారు.