బిహార్ ముఖ్యమంత్రి కార్యాలయానికి (CMO) గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు ఈ మెయిల్ పంపారు. సీఎం ఆఫీస్‌ను బాంబుతో పేల్చేస్తామని మెయిల్ లో పేర్కొన్నారు. బిహార్ స్పెషల్ పోలీసులు కూడా తమను అడ్డుకోలేరంటూ బీరాలు పలికారు. తాము అల్ కాయిదాకు సంబంధించిన వాళ్లమని మెయిల్ లో పేర్కొన్నారు. గత నెల 16న ఈ బెదిరింపు మెయిల్ రాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసును బిహార్ పోలీసులు, ఉగ్రవాద వ్యతిరేక దళం సంయుక్తంగా దర్యాప్తు జరుపుతున్నాయి.
గతంలో పట్నా విమానాశ్రయానికి కూడా ఇదే తరహా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి బాంబులేదని నిర్ధారించారు. జూలైలో పట్నాలోని ఓ నివాసం నుంచి బాంబు తయారీ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 35 లైవ్ కాట్రిడ్జ్‌లు, పొటాషియం నైట్రేట్ బాక్స్, ట్రీ ఫిల్ లిక్విడ్ బాక్స్ స్వాధీనం చేసుకుని పవన్ మహతో అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.
వార్నింగ్ మెయిల్ నేపధ్యంలో సీఎం నితీశ్ కుమార్ కార్యాలయ భద్రతా వ్యవస్థను మరింత అప్రమత్తం చేశారు. కార్యాలయ ప్రాంగణంలో అణువణువునా జల్లెడ పడుతున్నారు.