నాయకత్వం అంటే ఎలా ఉండాలో ఆమె తన చేతల్లో చూపించింది. ప్రకృతి విపత్తుతో అల్లల్లాడిన కేరళ వయనాడ్ ప్రాంతంలో 190 అడుగుల పొడవైన బ్రిడ్జిని కేవలం 31 గంటల్లో తన బృందంతో కలిసి నిర్మించింది. ముండక్కయ్ దగ్గర కొండచరియలు విరిగిపడిన చోట సహాయక చర్యలకు ఆ బ్రిడ్జి నిర్మాణం ఎంతో సహాయకరంగా నిలిచింది. భారత సైన్యంలో మహిళా ఇంజనీర్‌గా పనిచేస్తున్న సీతా షెల్క్ విజయగాధ ఇది.
ఇటీవలి భారీ వర్షాలు, వరదల కారణంగా కొండచరియలు విరిగిపడి, వయనాడ్ ప్రాంతం అల్లకల్లోలమైపోయింది. రహదారులు ధ్వంసమైపోవడంతో అక్కడ అక్కడ సహాయక చర్యలు దాదాపు నిలిచిపోయాయి. రహదారి రవాణా నిలిచిపోవడంతో పలుప్రాంతాలకు సహాయం అందని దుస్థితి నెలకొంది. అలాంటి సమయంలో రంగంలోకి దిగింది సీతా షెల్క్. కేవలం 31గంటల వ్యవధిలో 190 అడుగుల పొడవైన బ్రిడ్జి నిర్మించింది. 140మంది సైనికుల బృందంతో ఆమె ఆ దుష్కరమైన కార్యాన్ని సుసాధ్యం చేసింది. విపత్తు సమయాల్లో భారత మిలటరీ ఇంజనీర్ల వేగాన్నీ, సామర్థ్యాన్నీ చాటిచెప్పింది.
మేజర్ సీతా షెల్కే సాధించిన ఈ విజయంలాగే, ఆమె జీవితగాధ కూడా స్ఫూర్తిదాయకమైనది. మహారాష్ట్రలోని గడిల్‌గావ్ అనే చిన్న పల్లెటూరు ఆమె స్వగ్రామం. అహ్మద్‌నగర్‌లోని ప్రవర రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. బాల్యం నుంచీ ఐపీఎస్ ఆఫీసర్ అవాలన్నది ఆమె కల. దాన్నే కొద్దిగా మార్చుకుని భారత సైన్యం వైపు అడుగులు వేసింది. సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ పరీక్షలు రాస్తూ, తన మూడో ప్రయత్నంలో పాస్ అయింది. 2012లో భారత సైన్యంలో చేరింది. అడ్వొకేట్ తండ్రి అశోక్ బిఖాజీ షెల్కే సహా కుటుంబం అంతా ఆమెకు అండగా నిలిచింది. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీలో శిక్షణ సీతా షెల్కేను రాటుదేల్చింది. ఆ నేర్పు, చొరవ, దృఢసంకల్పం, అంకితభావం, దేశభక్తి వంటి గుణాల కారణంగానే మేజర్ సీత అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో సైతం వయనాడ్‌లో బ్రిడ్జి నిర్మించగలిగింది.
సంక్షోభ సమయాల్లో భారత సైన్యం ఆవశ్యకత ఎంత ముఖ్యమో, భారత సైన్యం అంకితభావం ఎంత గొప్పదో ఈ నిర్మాణం మరొక్కసారి నిరూపించింది. కాంగ్రెస్, కేరళలో అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ వంటి రాజకీయ పక్షాలు భారత సైన్యం సమర్ధతను, నాయకత్వ పటిమనూ పలుమార్లు సందేహించాయి, తీవ్రంగా విమర్శించాయి. అయినప్పటికీ వయనాడ్ విపత్తు సమయంలో భారత సైన్యం తక్షణం రంగంలోకి దిగింది, అద్భుతమైన సామర్థ్యంతో, అపురూపమైన అంకితభావంతో పనిచేసింది. శరవేగంగా బెయిలీ బ్రిడ్జి నిర్మాణం, కొనసాగుతున్న సహాయక చర్యలు విపత్తు స్పందనలో భారత సైన్యం కీలక పాత్రకు నిదర్శనాలుగా నిలిచాయి.
జులై 30 ఉదయం కేరళలోని వయనాడ్ ప్రాంతంలో రెండు ప్రదేశాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ విపత్తు కారణంగా భారీ విధ్వంసం జరిగింది.