కేరళలో చర్చి నిర్వహణలోని ఒక కళాశాలలో ముస్లిం విద్యార్ధులు తాము నమాజ్ చేసుకోడానికి ఒక గదిని ప్రత్యేకంగా కేటాయించాలని డిమాండ్ చేసారు. కొద్దిరోజులుగా నడుస్తున్న ఆ వివాదం తాజాగా ఓ కొత్త మలుపు తిరిగింది. ప్రత్యేక గది కేటాయింపు డిమాండ్‌ను స్థానిక ముస్లిం సంస్థ మహల్ కమిటీ వ్యతిరేకించింది. విద్యార్ధుల చర్యలకు క్షమాపణలు కూడా చెప్పింది.
మూవత్తుపుళ పట్టణంలో, నిర్మలా కళాశాలను ఓ చర్చ్ నిర్వహిస్తోంది. అక్కడ చదువుతున్న ముస్లిం విద్యార్ధులు తమకు నమాజ్ చేసుకోడానికి ప్రత్యేక గది కావాలని డిమాండ్ చేయడంతో వివాదం మొదలైంది. స్థానిక ముస్లిం నాయకులు, మహల్ కమిటీ ప్రతినిధులు అయిన కెఎం అబ్దుల్ మజీద్, పిఎ బషీర్ సోమవారం కళాశాల యాజమాన్యంతో సమావేశమయ్యారు. ముస్లిం విద్యార్ధులు చేసిన డిమాండ్‌ను తాము వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేసారు. వివాదంలో ఉన్న ముస్లిం విద్యార్ధుల చర్యలకు క్షమాపణలు కూడా అడిగారు.
‘‘కాలేజీలో నమాజ్‌కు ప్రత్యేక గది గురించి మహల్ కమిటీ అంగీకారం లేకుండా డిమాండ్ చేసారు. రహస్య అజెండాతో ఆ వివాదంలోకి ముస్లిం స్టూడెంట్ ఫెడరేషన్ పేరును కూడా లాగారు. మూవత్తుపుళలోని ముస్లిం సమాజం, పట్టణంలో మతసామరస్యం కొనసాగాలని కోరుకుంటోంది. అలాంటి చర్యలకు మద్దతు ఇవ్వడం లేదు’’ అని బషీర్ వెల్లడించారు.
కాలేజీ ఆవరణలో నమాజ్‌కు ప్రత్యేక గది డిమాండ్‌కు తాము మద్దతివ్వడం లేదని మహల్ కమిటీ స్పష్టం చేసింది. దానికి బదులు ఆ విద్యార్ధులు తమ మధ్యాహ్నం నమాజ్ చేసుకోడానికి దగ్గరలో ఉన్న మసీదుకు వారిని పంపించడానికి ఏర్పాట్లు చేయాలని ప్రతిపాదన పెట్టింది. అక్కడికి ముస్లిం విద్యార్ధినులను సైతం పంపించడానికి అనుమతించాలని కోరింది. ప్రత్యేక నమాజ్ గది డిమాండ్‌ను ముస్లిం స్టూడెంట్ ఫెడరేషన్ కూడా వ్యతిరేకించింది.
ఒకట్రెండు రోజుల క్రితం స్థానికంగా సోషల్ మీడియాలో ఒక ఫొటో విపరీతంగా వైరల్ అయింది. అందులో, కళాశాల విద్యార్ధులు ప్రిన్సిపాల్‌ను బంధించినట్లుగా ఉంది. వారి డిమాండ్లు ఒప్పుకోకపోతే ప్రిన్సిపాల్‌ను చంపేస్తామని వారు తమ సంకేతాల ద్వారా హెచ్చరించారు. ఆ సంఘటన కూడా వారి డిమాండ్లను కమిటీ ఇంకా ఒప్పుకోలేదని చెప్పారు.
ఈ వివాదం జులై 26, శుక్రవారం నాడు మొదలైంది. నిర్మల కళాశాలలోని కొందరు ముస్లిం విద్యార్ధినులు కాలేజీ వెయిటింగ్ హాల్లో నమాజ్ చేసుకున్నారు. ఆ విషయం కాలేజీ స్టాఫ్, యాజమాన్యానికి తెలియజేసారు. యాజమాన్యం ఆ విద్యార్ధినులను అక్కడ నమాజ్ చేయవద్దని చెప్పింది. దాంతో ముస్లిం విద్యార్ధులు ఆందోళన మొదలుపెట్టారు. ప్రతీరోజూ కాలేజీ క్యాంపస్‌లో నమాజ్ చేసుకోడానికి తమకు ప్రత్యేకం ఒక గది కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తమ మతధర్మం ప్రకారం నమాజ్ తప్పనిసరిగా చేయాలని, దానికి ప్రత్యేకమైన స్థలం కేటాయించాలనీ వారు డిమాండ్ చేసారు. క్రమంగా కళాశాలలోని ముస్లిం విద్యార్ధులందరూ గుమిగూడారు, కళాశాల ఫాదర్ ఫ్రాన్సిస్‌ను చుట్టుముట్టారు. కళాశాలకు కేవలం 200 మీటర్ల దూరంలోనే మసీదు ఉందనీ, నమాజ్ చేసుకోవాలనుకునేవారు అక్కడికి వెళ్ళవచ్చనీ ప్రిన్సిపాల్ వెల్లడించారు. ఐతే, మసీదులో మహిళలకు ప్రవేశం ఉండదు కాబట్టి, తమకు ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించాలని విద్యార్థినులు కోరుతున్నారని ఫ్రాన్సిస్ వివరించారు.
కాలేజీ యాజమాన్యం ఆ ప్రతిపాదనకు ఒప్పుకోలేదు. నిర్మలా కాలేజి లౌకికవాదాన్ని అమలుచేసే వ్యవస్థ అనీ, దాని ఆవరణలో నమాజులు చేసుకోనీయబోమనీ వివరించారు. ఒకవేళ ముస్లిం విద్యార్ధులు లిఖితపూర్వకంగా కోరితే శుక్రవారం వారికి నమాజ్ కోసం సెలవు ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. కాలేజీకి కేవలం 200 మీటర్ల దూరంలోనే మసీదు ఉందనీ, అక్కడకు వెళ్ళి నమాజ్ చేసుకోవచ్చనీ వివరించారు. ముస్లిం విద్యార్ధుల డిమాండ్‌ను క్రైస్తవ సంస్థలు సైతం వ్యతిరేకించాయి.
కేరళలోని ప్రసిద్ధ క్రైస్తవ మతసంస్థ సైరో-మలబార్ చర్చ్, నమాజులకు ప్రత్యేక గది ఇవ్వడమంటే క్రైస్తవ సంస్థ దైనందిన వ్యవహారాల్లో మతం జోక్యం చేసుకోవడమేనని వ్యాఖ్యానించింది. కేరళలోని మరో ప్రసిద్ధ క్రైస్తవ సంస్థ కేథలిక్ కాంగ్రెస్ కూడా నమాజులకు ప్రత్యేక గదుల డిమాండ్‌ను త్రోసిపుచ్చింది.
ఈ సంఘటన రాజకీయ రంగు కూడా పులుముకుంది. ప్రత్యేక గది డిమాండ్‌కు వామపక్షాలు, కాంగ్రెస్, ఇండీ కూటమిలోని మరికొన్ని పార్టీలూ మద్దతిచ్చాయి. అలాంటి డిమాండ్ చేసిన విద్యార్ధులను బీజేపీ కేరళ అధ్యక్షుడు కె సురేంద్రన్ అతివాదులుగా వర్ణించారు. ‘‘ముస్లిం యాజమాన్యంలో ఉన్న కళాశాలలు ఇతర మతాల విద్యార్ధులకు తమ మతం ప్రకారం ప్రార్థనలు చేసుకోడానికి ప్రత్యేక స్థలం కేటాయిస్తాయా? అని ప్రశ్నించారు. ఒకవేళ ముస్లిం గ్రూపులు కళాశాలల్లో సమస్య సృష్టించేందుకు ప్రయత్నిస్తే తామే భద్రత కల్పిస్తామని చర్చి యాజమాన్యం చెప్పింది.