ఫ్యాక్ట్ పేపర్ అంటూ అప్పుల లెక్కలు చెప్పిన మాజీ సీఎం
దమ్ముంటే శాసనసభకు వచ్చి మాట్లాడాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇంకా వివరంగా చెప్పాలంటే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడైనప్పటి నుంచే రాష్ట్ర రుణభారంపై విపరీతమైన చర్చ మొదలైంది. ఎన్నికల ఫలితాల తర్వాత, కొత్త ప్రభుత్వం కొలువుదీరి నెలన్నర అయిన తర్వాత కూడా ఆ చర్చ చల్లారకపోగా మరింత ఎక్కువగా జరుగుతోంది.
రాష్ట్ర ఖజానా ఖాళీ కావడానికి తోడు ఆంధ్రప్రదేశ్ అప్పులపాలు కావడానికి వైసీపీ అస్తవ్యస్త పాలనే కారణమని టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ పాలనలో ఆర్థిక అవకతవకలపై శాసనసభ వేదికగా శ్వేతపత్రం విడుదల చేసింది.దీనిపై వైసీపీ అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. రాష్ట్ర విభజన తర్వాత అధికారం చేపట్టిన టీడీపీనే అప్పులు విరివిగా చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచిందని వైసీపీ వాదిస్తోంది. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్, టీడీపీ ఆరోపణలను తిప్పికొడుతున్నారు. అనుకూల మీడియాతో వైసీపీ పాలనపై తప్పుడు వార్తలు ప్రచురింప చేసి కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చెబుతున్న అప్పుల లెక్కలు తప్పు అని ఢంకా బజాయించి చెబుతున్నారు. తమ హయాంలోనే ప్రజలకు ఎక్కువ మేలు జరిగిందంటున్నారు.
ఎన్డీయే కూటమి ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై స్పందించిన మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్, ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర అప్పులు రూ.14 లక్షల కోట్లు అని చంద్రబాబు ప్రచారం చేశారని గుర్తు చేశారు. అధికారం కోసం ఎడాపెడా హామీలిచ్చారని విమర్శించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.10 లక్షల కోట్లు అప్పు ఉందంటూ గవర్నర్ ప్రసంగంలో చెప్పించారని దుయ్యబట్టారు. కానీ రాష్ట్రానికి ఉన్న మొత్తం అప్పులు రూ.7.48 లక్షల కోట్లే అన్నారు. రాష్ట్ర అప్పులపై తాము ఫ్యాక్ట్ పేపర్ విడుదల చేస్తున్నామన్నారు. గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించడం ధర్మమేనా అని ప్రశ్నించారు.
2019 మే 30 నాటికి వైసీపీ అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్ర ఖజానాలో రూ.వంద కోట్లే ఉన్నాయని అప్పట్లో మీడియానే చెప్పిందన్నారు. ప్రస్తుతం చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన జూన్ 12 నాటికి రాష్ట్ర ఖజానాలో రూ.7–8 వేల కోట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. రూ.2.27 లక్షల కోట్లతో 2019–20 పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పాటు ఎన్నికల వాగ్దానాలు అన్నీ అమలు చేశామన్నారు.
టీడీపీ సూపర్ సిక్స్.. డక్కౌట్ అయినట్టు ఉందని వైసీపీ నేత, మాజీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. ప్రజల ఆశలు నీరుగార్చేలా శ్వేతపత్రం ఉందన్నారు. వైసీపీ పాలనలోనే ఏపీ తలసరి ఆదాయం మెరుగుపడిందన్నారు. 2014-19లో రాష్ట్ర ఆదాయం 6 శాతం ఉంటే, వైసీపీ పాలనలో ఆ ఆదాయం 16 శాతానికి పెరిగిందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న అప్పులు గురించి ఓ వర్గం మీడియా ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.
జగన్ కు చంద్రబాబు సవాల్….
వైసీపీ అధినేత జగన్‌కు ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని ముఖ్యమత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై ఇంట్లో కూర్చోని మాట్లాడటం ఏంటని దుయ్యబట్టారు. అబద్ధాలు చెబుతూ ప్రజల్ని మభ్యపెడతారా అని మండిపడ్డారు. జగన్ చెబుతున్నట్లుగా రూ.2.71 లక్షల కోట్లే బటన్ నొక్కి పంపిణీ చేస్తే.. రూ.9.74 లక్షల కోట్ల అప్పు ఎందుకయ్యిందో సమాధానం చెప్పాలన్నారు.
రాష్ట్రాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. శ్వేతపత్రంలో చూపినదానికంటే ఎక్కువే వైసీపీ ప్రభుత్వం అప్పులు చేసిందన్నారు. చట్టసభలకు వచ్చి జగన్ మాట్లాడితే ప్రభుత్వం తగిన సమాధానం చెబుతుందన్నారు. వైసీపీ కి ప్రతిపక్ష హోదా రావడానికి పదేళ్ళు పడుతుందని ఎద్దేవా చేశారు.
గత వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా అప్పులు చేసి రాష్ట్రానికి ఉన్న గుడ్ విల్ ను చెడగొట్టిందని టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సంపద సృష్టించి తద్వారా వచ్చిన ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందన్నారు. ప్రజాధనాన్ని వైసీపీ నేతలు దొచుకున్నారని ఆరోపించారు.
సంక్షేమం పేరిట ఎడాపెడా ఖర్చు చేసిన ప్రభుత్వాలు ఖజానా ఖాళీ అయిన తర్వాత ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని పలువురు ఆర్థిక నిపుణులు విమర్శిస్తున్నారు. రాజకీయ విమర్శలు మాని ఇప్పటికైనా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కృషి చేయాలని సూచిస్తున్నారు. సంక్షేమం పేరిట అనర్హులకు కూడా ఆయాచిత లబ్ధి చేకూర్చడం సరికాదని దెప్పిపొడుస్తున్నారు.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు