కెనడాలో కార్చిచ్చు రేగింది. ఒకచోట నుంచి మరోచోటుకు వేగంగా మంటలు వ్యాపిస్తున్నాయి. తాజాగా జాస్పర్ నగరాన్ని మంటలు దాదాపు 100 మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్న అగ్ని , నివాసాలు, వాణిజ్యసంస్థలను కాల్చి బూడిద చేసింది. కేవలం 30 నిమిషాల్లోనే 5కిలోమీటర్లు దూరం మంటలు వ్యాపిస్తున్నాయి.
ప్రజలు అత్యంత కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నారని, దాదాపు 50శాతం పట్టణం కాలిపోయినట్లు ప్రభుత్వ ప్రతినిధులు వెల్లడించారు.జాస్పర్ నగరానికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దాదాపు 20,000 మంది టూరిస్టులు, 5,000 మంది స్థానికులు ప్రాణాలు కాపాడుకునేందుకు ఇతరు ప్రాంతాలకు పయనం అయ్యారు. జాస్పర్ నేషనల్ పార్క్‌ను ఏడాదికి 25 లక్షల మంది సందర్శిస్తారు.
జాస్పర్ సమీపంలోని రెండు కార్చిచ్చులు కలిసి పోవడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా తయారైందని పార్క్ నిర్వాహకులు పేర్కొన్నారు. దాదాపు 36,000 హెక్టార్లలో మంటలు వ్యాపించే అవకాశం ఉందన్నారు.
ఆస్పత్రులు, ఎమర్జెన్సీ సర్వీసెస్ భవనం, పాఠశాలలు, యాక్టివిటీ సెంటర్ వంటి వాటిని మంటల నుంచి రక్షించేందుకు చర్యలు చేపట్టారు. నేషనల్ పార్క్‌లోని వంతెనలు చాలావరకు మంటలకు ఆహుతయ్యాయి.
కార్చిచ్చులను పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు కొన్ని వారాల సమయం పట్టొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. జాస్పర్ లో పరిస్థితులు తనను కలిచి వేస్తున్నాయని ప్రధాని ట్రూడో అన్నారు. గతేడాది జాస్పర్ వద్ద వ్యాపించిన కార్చిచ్చుకు 22 లక్షల హెక్టార్లలో నష్టం వాటిల్లింది.