ర్యాగింగ్ విష సంస్కృతి మరోసారి వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని దశాబ్దాల చరిత్ర కలిగిన ఎస్‌ఎస్‌ఎన్ కళాశాలలో సీనియర్ విద్యార్థులు జూనియర్లను కర్రలతో విపరీతంగా కొడుతున్న వ్యవహారం వెలుగుచూసింది. నరసరావుపేటలో ఎస్‌ఎస్‌ఎన్ కాలేజీలో చేరేందుకు చాలా మంది విద్యార్థులు ఆసక్తి కనబరుస్తుంటారు. ఇక్కడ ఎన్‌సీసీ ఉండటంతో చాలా మంది ఎస్‌ఎస్‌ఎన్ కాలేజీలో చేరేందుకు పోటీపడుతుంటారు. గత వారం పల్నాడుకు చెందిన ఓ వ్యక్తి తన కుమారుడిని కాలేజీలో చేర్పించడానికి తీసుకువచ్చారు. ఈ సమయంలో ఇక్కడ జాయిన్ అయితే సీనియర్లు కొడతున్నారంటూ ఆ విద్యార్థి, తన తండ్రికి ఓ వీడియో చూపించాడు. ఆ తరవాత వీడియో వైరల్ అయింది.
ర్యాగింగ్ వ్యవహారం తెలియగానే పట్టణ సీఐ కాలేజీని సందర్శించి ఆరా తీశారు. ఈ వీడియో గత ఏడాది ఫిబ్రవరిలో జరిగినట్లు గుర్తించారు. జూనియర్లను సీనియర్లు కర్రతో తీవ్రంగా కొడుతూ పైశాచిక ఆనందం పొందుతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. వార్డెన్లు సీనియర్లకు సహకరించడం వల్లే ఇలా జరిగిందని పోలీసులు గుర్తించారు. దీనిపై వెంటనే పోలీసులు స్పందించి, విచారణ చేపట్టారు.