కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరాల జల్లు కురిపించారు. ఆంధప్రదేశ్ పునర్వవస్థీకరణకు కేంద్రం కట్టుబడి ఉందని, అమరావతి రాజధాని అభిృద్ధికి రూ.15 వేల కోట్లు అందిస్తామన్నారు. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రం తీసుకుంటుందన్నారు. కేంద్ర బడ్జెట్లో నిరుద్యోగ యువత, మహిళలు, రైతులు, పేదల కోసం ప్రత్యేక పథకాలు ప్రకటించారు.
తొలిసారి ఉద్యోగంలో చేరిన వారికి మొదటి నెల జీతం కేంద్ర ప్రభుత్వం మూడు దఫాలుగా చెల్లించనుంది.గరిష్ఠంగా రూ. 15 వేలు చెల్లిస్తారు. 4 కోట్ల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చే కార్యక్రమం ప్రారంభించనున్నారు. కోటి మంది రైతులకు సేంద్రీయ సాగుపై శిక్షణ ఇచ్చే కార్యక్రమం చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. 80 కోట్ల మంది పేదలకు మరో ఐదేళ్లు ఉచితంగా ఆహార ధాన్యాలు సరఫరా చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
దేశంలో తాజాగా ద్రవ్యోల్బణం దిగివచ్చింది. గత నెల 3.1గా నమోదైందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. రైతుల ఆదాయం పెంచేందుకు ఇటీవల పలు పంటలకు మద్దతు ధరలు పెంచినట్లు గుర్తుచేశారు. వాతావరణ మార్పులు తట్టుకునే 9 రకాల నూతన వంగడాలు అందుబాటులోకి తీసుకురానున్నారు. వరుసగా ఏడోసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు.