అంతర్జాతీయ సంక్షోభ పరిస్థితుల నడుమ భారతదేశపు ఆర్థిక పరిస్థితి బలంగానూ పటిష్ఠంగానూ ఉందని, నిలకడగా కొనసాగుతోందనీ ఆర్థిక సర్వే చెబుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ఇవాళ ప్రవేశపెట్టారు.
కోవిడ్ అనంతర సంక్షోభ పరిస్థితుల నుంచి భారత ఆర్థిక, ద్రవ్య వ్యవస్థలు స్థిరంగా ఎదుగుతున్నాయి, నిలకడగా పెరుగుతున్నాయి అని ఆర్థిక సర్వే పేర్కొంది. అంతర్జాతీయంగా ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితుల్లో ఒడుదొడుకులు ఉన్నప్పటికీ, భారతదేశం చాలా ఉన్నతస్థాయిలో ఆర్థికాభివృద్ధిని ఆకాంక్షిస్తోందని వివరించింది.
‘‘ఈ రికవరీ కొనసాగించాలంటే, దేశీయ ఆర్థిక స్థితిగతులు చాలా ఎదగాలి. ఎందుకంటే వాణిజ్యం, పెట్టుబడులు, వాతావరణం వంటి కీలకమైన అంతర్జాతీయ విషయాల్లో నిర్ణయానికి రావడం అసాధారణంగా సంక్లిష్టంగా మారింది’’ అని సర్వే చెబుతోంది.
‘‘చాలాకాలంగా ప్రభుత్వ పెట్టుబడులే వ్యవస్థకు ఆధారంగా కొనసాగుతున్నాయి. ప్రైవేట్ రంగం ఎంతో గడ్డుకాలం తర్వాత 2022 నుంచీ పెట్టుబడులు మొదలుపెట్టింది. ఇంక ప్రభుత్వరంగం నుంచి ప్రైవేటురంగం అందిపుచ్చుకోవాలి. పెట్టుబడుల వేగాన్ని పెంచాలి. అదృష్టవశాత్తూ పరిశ్రమ నుంచి అందుతున్న సంకేతాలు సానుకూలంగా, ప్రోత్సాహకరంగా ఉన్నాయి’’ అని సర్వే వివరించింది.
‘‘గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో అభివృద్ధి రేటు 7శాతం, 9.7శాతంగా ఉన్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో కూడా ఆర్థికాభివృద్ధి మరింత మెరుగ్గానే ఉండబోతోంది’’ అని సర్వే అంచనా వేసింది.
ద్రవ్యోల్బణం రేటు చాలావరకూ నియంత్రణలోనే ఉందని, కొన్ని నిర్దిష్టమైన ఆహార పదార్ధాల ద్రవ్యోల్బణం రేట్లు మాత్రం ఎక్కువగా ఉన్నాయనీ సర్వే చెప్పింది. వాణిజ్యలోటు 2023 ఆర్థిక సంవత్సరం కంటె 2024 ఆర్థిక సంవత్సరంలో తక్కువగా ఉందని చెప్పింది. ఈ యేడాది కరెంట్ అకౌంట్ లోటు జీడీపీలో సుమారు 0.7శాతం ఉంటుందని అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం ఆఖరి త్రైమాసికంలో కరెంట్ అకౌంట్లో మిగులు నమోదయింది. విదేశీ మారక నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి.
జాతీయ ఆదా గణాంకాల ప్రకారం ఆర్థికేతర ప్రైవేటురంగ పెట్టుబడులు 2021లో తగ్గాయి, 2022, 2023 ఆర్థిక సంవత్సరాల్లో గణనీయంగా పెరిగాయి. యంత్రాలు, పరికరాల్లో పెట్టుబడులు 2020, 2021 రెండేళ్ళపాటు వరుసగా తగ్గినప్పటికీ ఆ తర్వాత బలంగా పెరుగుతున్నాయి. ప్రైవేటురంగంలో మూలధనం ఏర్పాటు, కొంచెం నెమ్మదిగానే అయినా, పెరుగుదలనే నమోదు చేస్తుందని సర్వే అంచనా.
అనూహ్యంగా ఎదురయే ప్రమాదమున్న ప్రపంచ సవాళ్ళ మధ్య మనదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి మూడు కారకాలు కావాలి. ప్రభుత్వాల విశ్వసనీయత ఘనంగా ఉండాలి. ఆ నమ్మకాన్ని ప్రైవేటు రంగం దీర్ఘకాలిక ప్రణాళికలతో నిజాయితీ పనితీరుతో ముందుకు తీసుకెళ్ళాలి. ప్రజలు తమ ఆర్థిక స్థితిగతులకు, తమ శారీరక, మానసిక ఆరోగ్యాలకూ బాధ్యత తామే స్వయంగా తీసుకోవాలి’’ అని సర్వే చెబుతోంది.
ఆర్థిక సర్వే 2023-24ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంటు ముందు ప్రవేశపెట్టారు. 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఆదాయ వ్యయాల గురించి ఈ సర్వే సూచనలు ఇస్తుంది. దీని తర్వాత నిర్మల తన ఏడవ బడ్జెట్ను పార్లమెంటుకు సమర్పిస్తారు. దానితో, అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా ఆమె మొరార్జీ దేశాయ్ రికార్డును దాటేస్తారు. ఆయన ఇప్పటివరకూ ఐదుసార్లు బడ్జెట్ సమర్పించారు.