భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్, డాక్టర్ ఎస్ సోమనాథ్ అయ్యారు. అవును, ఆయన ఇవాళ పిహెచ్డి పట్టా పుచ్చుకున్నారు. గతేడాది ఆగస్టు 23న చంద్రయాన్-3 మిషన్‌ను విజయవంతం చేసినప్పటి కంటె ఇవాళ ఆయన ఎక్కువగా ఆనందిస్తున్నారంటే ఆశ్చర్యం ఏమీ లేదు.
ఏరోస్పేస్ ఇంజనీర్ అయిన ఎస్ సోమనాథ్ ఇవాళ మద్రాస్ ఐఐటీ నుంచి పిహెచ్డి పట్టా పొందారు. ఆయనకు ఇప్పటికే సుమారు డజను గౌరవ డాక్టరేట్లు ఉన్నాయి. భారతదేశపు భారీ లాంచర్ వెహికిల్ ‘మార్క్-3’కి లీడ్ డెవలపర్ ఆయనే. చంద్రయాన్ ప్రయోగంలో చంద్రుడి దక్షిణధ్రువం మీద విక్రమ్ ల్యాండర్ సుతారంగా ల్యాండ్ అయే ప్రయోగాన్ని విజయవంతం చేసిందీ ఆయనే. అటువంటి శాస్త్రవేత్తగా ఆయనకు వివిధ విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేసాయి. అయితే, తన పరిశోధనకు గాను పట్టా పొందడం అనేది ఆయనకు గొప్ప గర్వకారణం. అది కూడా ప్రతిష్ఠాత్మక మద్రాస్ ఐఐటీ నుంచి దక్కడం మరింత ఘనకీర్తి.
ఇవాళ మద్రాస్ ఐఐటీ నుంచి డాక్టరేట్ పట్టా స్వీకరించడం తన జీవితంలో గొప్ప గౌరవం అన్నారు సోమనాథ్. ‘‘చిన్నప్పటినుంచీ నేను బాగా చదివే విద్యార్ధినే. కానీ ఒక పల్లెటూరి పిల్లవాడిగా ఐఐటి ప్రవేశపరీక్ష రాయడానికి ధైర్యం చేయలేకపోయాను. అయినా, ఏదో ఒకరోజు ఐఐటీ పట్టా పొందుతానని కలగనేవాణ్ణి. నేను బెంగళూరులోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి మాస్టర్స్ చేయగలిగాను. ఇప్పుడు ఐఐటీ మద్రాస్ నుంచి పిహెచ్డి పూర్తి చేయగలిగాను’’ అంటూ సంతోషంతో చెప్పుకొచ్చారు సోమనాథ్.
‘‘పరిశోధన చేయడం ఎప్పుడూ కష్టమే. అందునా ఐఐటీ మద్రాస్ లాంటి పేరున్న విద్యాసంస్థలో చేయడం మరింత కష్టం. ఇది సుదీర్ఘ ప్రయాణం. నేను చాలా యేళ్ళ క్రితమే రిసెర్చ్ కోసం రిజిస్టర్ చేసుకున్నా. ఆ పరిశోధనాంశం నాకు ఎంతగానో ఇష్టమైనది. ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం, ఇంజనీర్‌గా ఇస్రోలో ఒక ప్రాజెక్ట్‌లో చేరినప్పుడు వైబ్రేషన్ ఐసోలేటర్స్‌కు సంబంధించిన అంశం మీద పరిశోధన మొదలుపెట్టాను. ఆ అంశం నా మనస్సులో సజీవంగా నిలిచిపోయింది. దానిమీద నేను ఎన్నో యేళ్ళు పనిచేసాను’’ అని సోమనాథ్ తన పరిశోధనా ప్రయాణం గురించి పంచుకున్నారు.
‘‘నా గత 35ఏళ్ళ పరిశ్రమ, ఆ శ్రమను థీసిస్‌గా మార్చడం, పేపర్లు పబ్లిష్ చేయడం, సెమినార్లకు అటెండ్ అవడం, నా థీసిస్‌ను డిఫెండ్ చేయడం… వాటన్నింటి ఫలితమే ఈ పిహెచ్డి. మీరు ఇవాళ చూసింది ఆఖరి దశ మాత్రమే. కానీ నిజానికి ఇదెంతో సుదీర్ఘమైన ప్రయాణం’’ అని వివరించారు.
డాక్టర్ సోమనాథ్ కేరళ అళప్పుళ జిల్లాలోని అరూర్‌లో సెంట్ అగస్టీన్స్ హైస్కూల్లో పాఠశాల విద్య అభ్యసించారు. ఎర్నాకుళం మహారాజా కాలేజీలో ఇంటర్మీడియెట్ చదివారు. కొల్లాంలోని తంగల్ కుంజు ముసైలర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందారు. 1985లో ఇస్రోలో చేరారు. క్రమంగా ఆ సంస్థ ఛైర్మన్ స్థాయికి ఎదిగారు.
ఆ క్రమంలో, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ కార్యదర్శిగా ఆయన జాతీయ రోదసీ విధానాన్ని రూపొందించారు. అంతరిక్ష రంగంలో స్టార్టప్స్‌ను ప్రోత్సహించారు. ఇస్రో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించిందీ ఆయనే. లాంచ్ వెహికిల్ ప్రొడక్షన్, స్పేస్‌క్రాఫ్ట్ ఆపరేషన్స్‌ను వాణిజ్యంగా లాభదాయకంగా తీర్చిదిద్దారు.
ఇస్రో ఛైర్మన్‌గా ఆయన నాయకత్వంలో చంద్రుడి దక్షిణ ధ్రువం మీదకు ల్యాండర్‌ను దింపిన చంద్రయాన్-3 ప్రయోగం ఘనవిజయం సాధించింది. ఆదిత్య-ఎల్1, ఎక్స్‌పోశాట్, ఇన్శాట్-3డిఎస్, ఓషన్‌శాట్, జీశాట్-24, కమర్షియల్ పీఎస్ఎల్వీ, ఎవిఎం3-ఒన్‌వెబ్ ఆయన ఇటీవలికాలంలో విజయాలు సాధించిన ప్రాజెక్టులు. సోమనాథ్ నాయకత్వంలోనే స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్, టెస్ట్ వెహికిల్ రూపొందాయి. మళ్ళీమళ్ళీ వినియోగించుకోగల రీయూజబుల్ లాంచ్ వెహికిల్ (ఆర్ఎల్వి-ఎల్ఇఎక్స్) ప్రయోగాలూ సాధ్యమయ్యాయి.
సోమనాథ్ ప్రస్తుతం భారతీయులను అంతరిక్షంలోకి పంపే ‘గగన్‌యాన్’ ప్రాజెక్టు రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గగన్‌యాన్, చంద్రయాన్ సీరీస్ వంటి ప్రాజెక్టులతో పాటు, రోదసిలో భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాన్నీ, చంద్రుడి మీదకు మానవులను పంపే కార్యక్రమాన్నీ కూడా సుసాధ్యం చేసే ప్రయత్నంలో ఉన్నారు.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు