కేంద్రంలోనూ, ఉత్తరప్రదేశ్‌లోనూ వరుసగా రెండుసార్లు గెలిచిన బీజేపీ, తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో దాదాపు 30సీట్లు కోల్పోయింది. బీజేపీ ఎక్కువ స్థానాలు కోల్పోయిన రాష్ట్రం అదే కావడం ఆ పార్టీని సెల్ఫ్‌డిఫెన్స్‌లో పడేసిందనే చెప్పాలి. యూపీలో తాము ఎందుకు పట్టు కోల్పోయాం అనే విషయంపై ఆ పార్టీ రాష్ట్రశాఖ క్షుణ్ణంగా అంతర్మథనం చేసుకుంది. విస్తృతమైన నివేదిక తయారుచేసి పార్టీ అధినాయకత్వానికి సమర్పించింది. పార్టీ అధ్యయనంలో ప్రధానంగా తెలిసిన పాయింట్లు ఏంటంటే… ప్రశ్నపత్రాల లీకేజీలు, ప్రభుత్వోద్యోగాలను కాంట్రాక్టు కార్మికులతో తాత్కాలికంగా భర్తీ చేయడం, అధికారుల వ్యవహారశైలి వంటి అంశాలు పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తినీ, నిరాశనూ కలగజేసాయి.
ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 ఎంపీ స్థానాలు ఉన్నాయి. వాటిలో 2019లో ఎన్డీయే 64 స్థానాలు గెలుచుకుంది. కానీ 2024లో 36 సీట్లకు, అంటే దాదాపు సగానికి పడిపోయింది. సమాజ్‌వాదీ పార్టీ-కాంగ్రెస్ కూటమి 43 సీట్లు గెలుచుకుంది. ఈ పతనంపై రాష్ట్ర బీజేపీ సమగ్రంగా విశ్లేషణ చేసింది. ప్రచారంలో జరిగిన లోటుపాట్ల గురించి ప్రధానంగా ప్రస్తావిస్తూ సుమారు 40వేల మంది ఫీడ్‌బ్యాక్ ఆధారంగా 15 పేజీల సమగ్ర నివేదికను అధిష్ఠానానికి సమర్పించింది. ఆ రిపోర్ట్ ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలలోనూ బీజేపీ ఓట్‌షేర్ సుమారు 8శాతం పతనమైంది. ఆ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో అటువంటి పతనాన్ని నివారించేందుకు నిర్ణయాత్మకమైన కార్యాచరణ రూపొందించాలని కేంద్ర నాయకత్వానికి ఆ నివేదిక సూచించింది.
ఈ మధ్యనే యూపీ బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర చౌధరి, ఉపముఖ్యమంత్రి కేశవప్రసాద్ మౌర్యలు పార్టీ సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. దేశ భవితవ్యాన్ని శాసించగలిగే యూపీలో తగిలిన ఎదురుదెబ్బల నేపథ్యంలో వ్యూహాన్ని సవరించుకునేందుకు రాష్ట్ర నాయకులతో మరిన్ని చర్చలు జరపాలని పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల మాట్లాడుతూ మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్లనే ఎంపీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని వ్యాఖ్యానించారు. అయితే ఉపముఖ్యమంత్రి కేశవప్రసాద్ మౌర్య ఆ వ్యాఖ్యలను త్రోసిపుచ్చారు. అప్పటినుంచీ పార్టీలో అంతర్గత విభేదాల గురించిన ఊహాగానాలు పెరిగిపోయాయి.
బీజేపీ ఉత్తరప్రదేశ్ విభాగం రాష్ట్రంలో తమ పనితీరు తగ్గిపోడానికి ఆరు కారణాలను ప్రధానంగా అంచనా వేసింది. వాటిలో ప్రధానమైనవి అధికారుల అతి చేష్టలు, పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి పెరిగిపోవడం, తరచుగా పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకవడం, ప్రభుత్వోద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడం. ఆ చర్యల వల్ల రిజర్వేషన్ల విషయంలో పార్టీ వైఖరిపై ప్రతిపక్షాలు చేసిన ప్రచారానికి మరింత బలం చేకూరింది.
‘‘ఎమ్మెల్యేలకు ఏ అధికారమూ లేదు. జిల్లా కలెక్టర్, ఇతర ఉద్యోగులది ఆడింది ఆట. దాంతో కార్యకర్తలు నిస్పృహకు గురయ్యారు. ఎన్నోయేళ్ళుగా ఆరెస్సెస్, బిజెపి కలిసి పనిచేసాయి, సమాజంలో బలమైన బంధాలను నిర్మించాయి. పార్టీ కార్యకర్తల స్థానాన్ని అధికారులు ఎప్పటికీ భర్తీ చేయలేరు’’ అని ఒక సీనియర్ నాయకుడు చెప్పారు.
మరో నాయకుడు ఇంకో విషయం చెప్పారు. ఒక్క యూపీలోనే గత మూడేళ్ళలో కనీసం 15 ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి. దానికి తోడు, ప్రభుత్వ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో నింపుతున్నారు. ఆ రెండు కారణాల వల్ల, రిజర్వేషన్లను నిలిపేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందంటూ ప్రతిపక్షాలు చేసిన ప్రచారాన్ని ప్రజలు బాగా నమ్మారని ఆ నాయకుడు వివరించారు.
ఇటీవల లఖ్‌నవూలో పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక సమావేశాలకు హాజరైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఈ అంశాలను వ్యవస్థీకృతంగా పరిష్కరించే విషయమై సీఎం యోగి ఆదిత్యనాథ్, భూపేంద్ర చౌధరి తదితర సీనియర్ నాయకులతో చర్చలు జరిపారు. ఈ విషయాలను మరింత సుదీర్ఘంగా చర్చించాల్సిన అవసరం ఉన్నందున రాష్ట్ర స్థాయి నాయకులను విడతలు విడతలుగా ఢిల్లీకి పిలుస్తున్నారు.
ఆ నివేదిక ఇంకో అంశాన్ని కూడా ప్రస్తావించింది. ఓటర్ల మద్దతు విపక్షాలకు తరలిందని గుర్తించింది. ఉదాహరణకు, కుర్మీ, మౌర్య సామాజికవర్గాల మద్దతు తగ్గిపోయింది. పార్టీకి దళితుల ఓట్లు కూడా గణనీయంగా తగ్గాయి. కొన్ని ప్రాంతాల్లో బీఎస్‌పీ ఓట్‌షేర్ తగ్గడం, కాంగ్రెస్ పనితీరు మెరుగుపడడాన్ని కూడా గుర్తించారు.
ప్రధానంగా, పార్టీ రాష్ట్ర నాయకత్వంలో అంతర్గత విభేదాల గురించి ఆ నివేదిక ప్రస్తావించిందని తెలుస్తోంది. పార్టీలో కుమ్ములాటలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని వెంటనే నిజాయితీగా పరిష్కరించుకోవాలని, క్షేత్రస్థాయి నుంచీ ప్రక్షాళన ప్రారంభించాలనీ వివరించారట.
యూపీలో బీజేపీకి కళ్యాణ్ సింగ్ హయాంలో ఓబీసీలు మద్దతుగా నిలిచారు. 1990లలో లోధ్ సామాజికవర్గం కాపు కాసేది. 2014లో నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీకి ఓబీసీలు పూర్తిస్థాయిలో అండదండలు అందించారు. ‘‘2014, 2017, 2019, 2022 ఎన్నికల వరుస విజయాలను తక్కువ అంచనా వేయకూడదు. సీనియర్ నేతలు జోక్యం చేసుకుని, మార్గదర్శకత్వం వహించాలి. కేంద్రం ఆదేశాలకు కట్టుబడి ఉండాల్సిన ప్రాధాన్యతను రాష్ట్రం అర్ధం చేసుకోవాలి. మనందరం సమానమే, ఏ ఒక్కరూ పెత్తనం చేయకూడదని గుర్తించాలి. నాయకులు స్థానిక అంశాలను సమగ్రంగా అర్ధం చేసుకోవాలి. పార్టీ కార్యకర్తల్లో నైతిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు ప్రయత్నాలు జరగాలి’’ అని ఒక సీనియర్ నాయకుడు చెప్పుకొచ్చారు.
ఈసారి ఎన్నికల్లో కుర్మీ, మౌర్య కులాలు పార్టీకి దూరం జరిగాయని నివేదిక స్పష్టం చేసింది. దళితుల ఓట్లలో మూడోవంతు మాత్రమే పార్టీకి పడ్డాయని కూడా గమనించింది. బిఎస్‌పి ఓట్‌షేర్ 10శాతం తగ్గితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో బాగా మెరుగుపడిందనీ, ఆ అంశమే మొత్తం ఫలితాలను ప్రభావితం చేసిందనీ నివేదిక వివరించింది. పార్టీ చాలాముందుగా టికెట్లు జారీ చేయడంతో ప్రచారం త్వరగా మొదలైపోయింది. ఆరు, ఏడు దశల ఎన్నికల నాటికి కార్యకర్తలు బాగా అలసిపోయారు. ఆ సమయానికి పార్టీ నాయకులు రిజర్వేషన్ విధానాల గురించి చేసిన ప్రకటనలు పరిస్థితిని ఇంకా దిగజార్చాయి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వంటివి సీనియర్ సిటిజన్లను ప్రభావితం చేస్తే, అగ్నివీర్ గురించిన ఆందోళనలు, పేపర్ లీకులు వంటివి యువతరాన్ని ఆందోళనకు గురిచేసాయి. దాంతో ఓట్లు ప్రత్యర్ధుల వైపు మళ్ళిపోయాయి అని ఆ నివేదిక స్పష్టం చేసింది.
పార్టీ బాగా బలహీనపడింది పశ్చిమ యూపీ, వారణాసి ప్రాంతాల్లో అని సమాచార విశ్లేషణలో తేలింది. అక్కడ మొత్తం 28 స్థానాల్లో పార్టీ కేవలం 8 సీట్లలో మాత్రమే గెలిచింది. పశ్చిమ యూపీలోని బ్రజ్ ప్రాంతంలో పార్టీ 13 స్థానాలకుగాను 8సీట్లు గెలుచుకుంది.
ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాథ్‌కు బాగా పట్టున్న గోరఖ్‌పూర్ ప్రాంతంలో 13 స్థానాల్లో బీజేపీ కేవలం 6 సీట్లు గెలుచుకుంది. అవధ్ ప్రాంతంలో 16 స్థానాల్లో 7 మాత్రం గెలవగలిగింది. కాన్పూర్-బుందేల్‌ఖండ్ ప్రాంతంలో 10 స్థానాల్లో కేవలం 4 మాత్రమే సాధించింది. ఈ నిరాశాకరమైన ఫలితాలకు కారణం మితిమీరిన విశ్వాసం అని సీఎం అంటే, పార్టీ వ్యవస్థ బలహీనపడడం వల్లనే అని ఉపముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.
కేంద్ర అధిష్ఠానం మాత్రం రాష్ట్ర నాయకత్వానికి తమ అంతర్గత విభేదాలు తక్షణం పరిష్కరించుకోవాలని ఆదేశించింది. వివిధ కారణాల వల్ల ఖాళీ అయిన 10 అసెంబ్లీ స్థానాలకూ త్వరలో ఉపయెన్నికలు జరగనున్నాయి. అంతవరకూ నాయకత్వాన్ని మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసారు. రాష్ట్ర నేతల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోవాలని, ఉపయెన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలనీ అధిష్ఠానం ఆదేశించింది అని ఒక నాయకుడు చెప్పారు. పార్టీ సీనియర్ నాయకులు ఇకపై నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తారు, ఓటర్లను కలుస్తారు, నష్టాన్ని పూడ్చే ప్రయత్నాలు చేస్తారని వివరించారు.
యోగి ఆదిత్యనాథ్ మద్దతుదారులు మాత్రం రాష్ట్ర పరిపాలన, శాంతిభద్రతలు, క్రమశిక్షణపై ముఖ్యమంత్రికి ఇప్పటికీ గట్టి పట్టు ఉందని చెబుతున్నారు. అందువల్లే రాష్ట్రం ఇంకా బీజేపీ చేతిలోనే ఉందంటున్నారు. ‘‘ప్రధాన సమస్య అభ్యర్ధుల ఎంపిక. ప్రజాదరణ లేని అభ్యర్ధులను మళ్ళీ నిలబెట్టారు. అలా చేయకుండా ఉండాల్సింది. టికెట్ల కేటాయింపులో బాబా (యోగి ఆదిత్యనాథ్) ప్రమేయమే లేదు. ముఖ్యమంత్రిగా ఆయన నిబద్ధత, సమగ్రతలపై ఏ అనుమానమూ లేదు. ఆ విషయాన్ని అధిష్ఠానం సైతం గుర్తించింది’’ అని యోగికి సన్నిహితుడైన ఒక ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.