మహారాష్ట్ర శాసన మండలి ఎన్నికల్లో ‘మహాయుతి’ కూటమి స్పష్టమైన ఆధిక్యం సాధించింది. 11 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తమ అభ్యర్ధులను నిలిపిన 9 సీట్లనూ గెలుచుకుంది. ముగ్గురు అభ్యర్ధులను నిలిపిన మహావికాస్ అఘాడీ కూటమి ఇద్దరిని మాత్రమే గెలిపించుకోగలిగింది. తమ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసారని కాంగ్రెస్, వారిపై చర్య తీసుకుంటామని ప్రకటించింది.
పెజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ నాయకుడు జయంత్ పాటిల్‌కు కాంగ్రెస్, శివసేన(యుబిటి), ఎన్‌సిపి(ఎస్సిపి) పార్టీల ‘మహా వికాస్ అఘాడీ’ (ఎంవిఎ) కూటమి మద్దతు పలికింది. అయితే విజయానికి కావలసిన 23 ఓట్లు మాత్రం పడలేదు. దాంతో ఆయన ఓడిపోయారు. మరోవైపు బిజెపి, ఎన్‌సిపి, శివసేన పార్టీల ‘మహాయుతి’ కూటమి నిలబెట్టిన 9మంది అభ్యర్ధులూ విజయం సాధించారు. నిజానికి 8మందికి సరిపడా ఓట్లు మాత్రమే ఉన్నప్పటికీ క్రాస్‌ఓటింగ్ ప్రభావంతో 9వ ఎఅభ్యర్ధి కూడా గెలిచారు.
అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్‌సిపి ఇద్దరు అభ్యర్ధులను నిలబెట్టింది. అయితే వారికి కావలసిన ఓట్లకంటె 8 ఓట్లు తక్కువ ఉన్నాయి. దాంతో ఒక అభ్యర్ధి ఓటమి ఖాయం అని అందరూ భావించారు. అయితే కాంగ్రెస్‌కు చెందిన 8మంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసారని తెలుస్తోంది. దానివల్ల ఎన్‌సిపి రెండో అభ్యర్ధి కూడా గెలవగలిగారు. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వారిపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ మహారాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే ప్రకటించారు.
త్వరలో జరగబోయే మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌గా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు రెండు కూటములకూ ప్రతిష్ఠాత్మకంగా నిలిచాయి.రెండు వర్గాలూ తమతమ ఎమ్మెల్యేలను వేర్వేరు హోటళ్ళలో ఉంచాయి. అయినప్పటికీ క్రాస్‌ఓటింగ్ జరగడంతో ఎంవిఎ కూటమి దెబ్బతింది.
మహారాష్ట్రలో 274మంది ఎమ్మెల్యేలున్నారు. ఈ ఎన్నికల్లో ఒక్కో ఎమ్మెల్సీకి 23మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. 103మంది ఎమ్మెల్యేలున్న బీజేపీ ఐదుగురు అభ్యర్ధులను నిలబెట్టింది. నలుగురి విజయం ఖాయం కాగా, ఐదో అభ్యర్ధికి 12 ఓట్లు తక్కువయ్యాయి. 37మంది ఎమ్మెల్యేలున్న శివసేన ఇద్దరు అభ్యర్ధులను నిలబెట్టింది. వారికి 9 ఓట్లు తక్కువయ్యాయి. 39మంది ఎమ్మెల్యేలున్న ఎన్‌సిపి ఇద్దరు అభ్యర్ధులను నిలబెట్టగా వారికి 7 ఓట్లు తక్కువయ్యాయి. మొత్తంగా ‘మహాయుతి’ కూటమి నిలబెట్టిన 9మంది అభ్యర్ధులకు 28ఓట్లు తక్కువయ్యాయి.
మరోవైపు కాంగ్రెస్‌కు 37మంది ఎమ్మెల్యేలున్నారు. ఆ పార్టీ ఒకే ఒక అభ్యర్ధిని నిలిపింది. దాంతో 14 ఓట్లు అదనంగా ఉన్నాయి. వాటిని మిత్రపక్షాలకు కేటాయించింది. శివసేన (యుబిటి)కి 15మంది ఎమ్మెల్యేలున్నారు. ఆ పార్టీ ఒకే అభ్యర్ధిని నిలిపింది. రెండో ప్రిఫరెన్షియల్ ఓటు సాయంతో ఆ అభ్యర్ధి గెలిచారు. ఎన్‌సిపి(ఎస్సిపి)కి 13మంది ఎమ్మెల్యేలున్నారు. ఆ పార్టీ తమ అభ్యర్ధిని నిలపలేదు, పెజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ అభ్యర్ధి జయంత్ పాటిల్‌కు మద్దతిచ్చింది. ఆయన 10ఓట్ల తేడాతో ఓడిపోయారు.