ఝార్ఖండ్ తాజా మాజీ ముఖ్యమంత్రి చంపయి సోరెన్, ఇప్పుడు మూడోసారి ముఖ్యమంత్రి అయిన హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో మంత్రి పదవి స్వీకరించారు. ఇవాళ రాంచీలో హేమంత్ కొత్త మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది. అంతకుముందు, శాసనసభ ప్రత్యేక సమావేశంలో నిర్వహించిన బలపరీక్షలో హేమంత్ గెలిచారు.
ఝార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు హేమంత్ సోరెన్, అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్ళవలసి వచ్చినందున జనవరి 31న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసారు. అప్పటి రాజకీయాల నేపథ్యంలో హేమంత్ భార్య బదులు పార్టీలో సీనియర్ నాయకుడైన చంపయి సోరెన్ ఫిబ్రవరి 2న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసారు. అయితే లోక్‌సభ ఎన్నికల తర్వాత హేమంత్ సోరెన్‌కు బెయిల్ లభించి, ఆయన బైటకు వచ్చారు. దాంతో జులై 3న చంపయి సోరెన్ మళ్ళీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసారు. ఆ సమయంలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేసారు.
జులై 4న హేమంత్ సోరెన్ ఝార్ఖండ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. ఇవాళ రాంచీలో శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి బలపరీక్ష నిర్వహించారు. ఆ పరీక్షలో హేమంత్ సోరెన్ గెలిచారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జెఎంఎం, కాంగ్రెస్, ఆర్జెడి కూటమిగా ఏర్పడ్డాయి. ఆ కూటమి మొత్తం 81 స్థానాల్లో 47 సీట్లు గెలుచుకుంది. అందువల్ల ఇవాళ్టి బలపరీక్షలో హేమంత్ సోరెన్ విజయం లాంఛనప్రాయమే అయింది.
బలపరీక్ష తర్వాత హేమంత్ కొత్త మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది. చంపయి సోరెన్‌తో పాటు బైద్యనాథ్ రామ్, బబీ దేవి, మిథిలేష్ ఠాకూర్, దీపక్ బిరువా, హఫిజుల్ హసన్ తదితరులు మంత్రులుగా ప్రమాణం చేసారు. కాంగ్రెస్ నాయకులు రామేశ్వర్ ఓరాన్, బన్నా గుప్తా, ఇర్ఫాన్ అన్సారీ, దీపికా పాండేసింగ్, ఆర్జెడి నాయకుడు సత్యానంద్ భోక్త కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు.
గత ప్రభుత్వంపై ఉపముఖ్యమంత్రి డ్రగ్స్ వ్యాఖ్యల కలకలం