తెలుగు రాష్ట్రాల విభజన అంశాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు ఇవాళ సమావేశమై చర్చిస్తున్నారు. ఆ నేపథ్యంలో భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయ భూములను రక్షించే అంశాన్ని కూడా చర్చించాలని విశ్వహిందూపరిషత్ వారికి విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ విహెచ్పి బాధ్యులు లేఖ పంపించారు.
విశ్వహిందూపరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బి నరసింహమూర్తి, సహకార్యదర్శి రావినూతల శశిధర్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి రాసిన లేఖలోని వివరాలు ఈ విధంగా ఉన్నాయి….
1878లో సోమరాజు పురుషోత్తమదాసు అనే భక్తుడు పురుషోత్తపట్నం గ్రామంలో 917 ఎకరాల భూమిని భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయానికి రిజిస్టర్డ్ వీలునామా ద్వారా సమర్పించాడు. అందులో ఇప్పుడు 889.5 ఎకరాలు స్వామివారి పేరు మీద ఉంది. ఆ భూమిని కబ్జా చేయడానికి ఆక్రమణదారులు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గత 70ఏళ్ళలో సుమారు 250 కేసుల్లో దేవస్థానానికి అనుకూలంగా కోర్టులు తీర్పులు ఇచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వాలూ ఆక్రమణలను నిలువరించాయి. రాష్ట్ర విభజన తర్వాత భద్రాచలం ఆలయం తెలంగాణలోకి, పురుషోత్తపట్నం ఆంధ్రప్రదేశ్‌లోకి విడిపోయాయి.
రాష్ట్ర విభజన అనంతరం భద్రాచలం దేవాలయ ఆస్తుల రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా వైఎస్ఆర్సిపి హయాంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పురుషోత్తపట్నంలోని ఆలయ భూములు యధేచ్ఛగా ఆక్రమణకు గురయ్యాయి. రాత్రికి రాత్రి అక్రమ కట్టడాలు వెలిసాయి. దేవాలయ భూముల్లో అన్యమతస్తుల ప్రార్థనామందిరాలు సైతం మొలిచాయి. ఆ విషయంలో తెలంగాణలో అప్పట్లో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి విశ్వహిందూ పరిషత్ పలుమార్లు విజ్ఞప్తులు చేసింది. భద్రాద్రి రాముడికి తలంబ్రాలు సమర్పించడానికి కూడా ఇష్టపడని నాటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, భద్రాచలం ఆలయ భూముల రక్షణకు ఏనాడూ చొరవ చూపించలేదు. ప్రభుత్వం నుంచి ఉన్నతస్థాయిలో చర్యలు లేకపోయినా ఆలయ అధికారులు దేవాలయ భూముల రక్షణ కోసం నిరంతరం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. వారు ఆలయ భూముల రక్షణ కోసం ప్రత్యక్ష కార్యాచరణకు దిగితే ఆక్రమణదారులు భౌతికదాడులకు సైతం తెగబడ్డారు. అయినా నాటి జగన్ ప్రభుత్వం కనీసం కేసులైనా నమోదు చేయలేదు. ఏపీ పోలీసులు పరోక్షంగా ఆక్రమణదారులకు సహకరించారు.
ఆలయ అధికారులు ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అధికారులకు, ఎటపాక తహసీల్దార్‌కు, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌కు, ఏపీ పోలీస్ శాఖకు 46సార్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసారు. అయినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఆక్రమణలపై కనీసం ఎఫ్ఐఆర్ అయినా నమోదు చేయలేదు. ఆలయ అధికారులు 2022లో ఏపీ హైకోర్టులో కేసు దాఖలు చేసారు. 2022 నవంబర్ 7న ఏపీ హైకోర్టు జడ్జి, ఆలయ భూములను రక్షించాలనీ, ఆక్రమణలు తొలగించాలనీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నీ, సంబంధిత 14 ప్రభుత్వశాఖలనూ ఆదేశిస్తూ తీర్పు ఇచ్చారు. కానీ జగన్ ప్రభుత్వం ఆ తీర్పును అమలుచేయలేదు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా ఆలయ అధికారులు, భక్తులు మళ్ళీ 2023, 2024 సంవత్సరాల్లో కోర్టు ధిక్కార కేసులు దాఖలు చేసారు. ఆ కేసులు ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.
ఇవాళ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ రాష్ట్ర విభజన అంశాల పరిష్కారం కోసం చర్చిస్తున్న సందర్భంలో భద్రాచలం దేవాలయ ఆస్తుల పరిరక్షణ అంశంపైన కూడా చర్చించాలని విశ్వహిందూపరిషత్ కోరింది. దేవాలయ ఆస్తుల పరిరక్షణ కోసం ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేసి, ఆలయ భూముల్లో వెలసిన ఆక్రమణలు తొలగించి, ఆస్తుల రక్షణకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
భద్రాచలం, తిరుమల తిరుపతి దేవస్థానాలు సహా తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ దేవాలయాలకు చెందిన స్థిరాస్తులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తరించి ఉన్నాయి. వాటి రక్షణ కోసం ఉమ్మడి టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలనీ, దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలనీ విహెచ్పి విజ్ఞప్తి చేసింది. రెండు రాష్ట్రాల్లోనూ ఉన్న దేవాలయాల ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరింది.