భారత్ లక్ష్యంగా ఉగ్రదాడులు జరుగుతున్నప్పటికీ భారతీయుల స్థైర్యం ఏ మాత్రం చెదరడం లేదు. ఇటీవల జమ్మూలో వరుసగా నాలుగు ఉగ్రదాడులు జరిగినప్పటికీ వైష్ణోదేవి ఆలయానికి భక్తులు సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు.
ఉగ్రదాడులను ఖండిస్తూ మరింత ఎక్కువ మంది భక్తులు వైష్ణోదేవిని దర్శించుకుంటున్నారు. అమ్మవారి దర్శనం కోసం దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రతీరోజూ బేస్ క్యాంప్ కాట్రాకు పోటెత్తుతున్నారు.
రిజిస్ట్రేషన్ కోసం కాట్రాలో చాలా సేపు వేచి ఉండటంతో పాటు దర్శనానికి కిలోమీటరు పొడవున భక్తులు బారులు తీరుతున్నారు. శుక్రవారం రాత్రి 8 గంటల సమయానికి 33,900 మంది భక్తులు ఆలయం దిశగా ముందుకు సాగారు.
ఉగ్రదాడుల నేపధ్యంలో వైష్ణో దేవి ఆలయంతో పాటు అక్కడికి సమీపంలో అన్నిప్రాంతాలలో సాయుధ బలగాలను మోహరించారు. పోలీసు డైరెక్టర్ జనరల్ ఆర్ఆర్ స్వైన్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు.
వైష్ణో దేవి పవిత్ర గుహల చుట్టూ భారీ సంఖ్యలో సీఆర్పీఎఫ్ సిబ్బందితో పాటు సాధారణ దుస్తుల్లో కమాండోలు పహారా కాస్తున్నారు.