హర్యానా రాష్ట్రంలోని పది పార్లమెంటరీ నియోజకవర్గాలకూ మే 25 శనివారం నాడు పోలింగ్ జరగనుంది. అక్కడ ప్రచారం నేటితో ముగియనుండడంతో బీజేపీ-కాంగ్రెస్ రెండు పార్టీలూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి.
హర్యానాలో మొత్తం పది నియోజకవర్గాలున్నాయి. అవి అంబాలా, కురుక్షేత్ర, సిర్సా, హిసార్, కర్నాల్, సోనిపట్, రోహ్తక్, భివానీ-మహేంద్రగఢ్, గురుగ్రామ్, ఫరీదాబాద్. బీజేపీ సొంతంగా పది స్థానాల్లోనూ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ 9 స్థానాల్లోనూ, వారి మిత్రపక్షంగా ఆమ్ఆద్మీపార్టీ కురుక్షేత్ర ఒక్క స్థానంలోనూ పోటీ చేస్తున్నాయి.
హర్యానాలోని ప్రముఖమైన స్థానాల స్థితిగతులను ఒకసారి పరిశీలిద్దాం.
రోహ్తక్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా రాజ్యసభ సభ్యుడు దీపేందర్ హూడా బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన తక్కువ మార్జిన్లో ఓడిపోయారు. ఈసారి ఆయన బీజేపీ సిట్టింగ్ ఎంపీ అరవింద్ శర్మతో పోరాడుతున్నారు. దీపేందర్‌కు ఆయన తండ్రి, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపీందర్‌సింగ్ హూడాకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమైనవిగా నిలిచాయి.
హిసార్ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా ఉంది. చౌతాలా వంశానికి చెందిన ముగ్గురు అభ్యర్ధులు బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి రంజిత్ చౌతాలా, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ నుంచి సునయనా చౌతాలా, జేజేపీ నుంచి నయనా చౌతాలా పోటీ పడుతున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ జయప్రకాష్‌ను మోహరించింది.
సిర్సాలో కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ కేంద్రమంత్రి కుమారి సెల్జా పోటీ చేస్తున్నారు. ఎస్సీ రిజర్వుడు స్థానమైన ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధిగా అశోక్ తన్వర్ బరిలో ఉన్నారు. ఆయన గతంలో కాంగ్రెస్ రాష్ట్రశాఖ అధ్యక్షుడు. ఈ ఎన్నిక వారిద్దరికీ ప్రతిష్ఠాత్మకమే. ఎందుకంటే రాష్ట్రంలోని ఎస్సీలకు నాయకుడు ఎవరవుతారనే విషయం ఈ ఎన్నికల ద్వారా తేలిపోతుంది.
గుర్గావ్లో బీజేపీ మరోసారి ప్రస్తుత కేంద్రమంత్రి రావ్ ఇందర్జిత్ సింగ్నే బరిలోకి దింపుతోంది. ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ సినీనటుడు రాజ్‌బబ్బర్‌ను నిలబెట్టింది.
కర్నాల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధిగా మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ పోటీలో ఉన్నారు. ఆయనపై కాంగ్రెస్ దివ్యాంశు బుద్ధిరాజాను నిలబెట్టింది.
కురుక్షేత్ర స్థానంలో ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ బీజేపీ అభ్యర్ధిగా ఉన్నారు. అక్కడ ఇండీ కూటమి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తమ అభ్యర్ధిగా సుశీల్ గుప్తాను నిలబెట్టింది.
భారత్‌పై యుద్ధానికి 130 అణుబాంబులు సిద్దం : పాక్ మంత్రి ప్రేలాపనలు