Srikakulam Lok Sabha Constituency Profile
ఉత్తరాంధ్రలో మొదటి జిల్లాగా ఒడిషాతో సరిహద్దులు పంచుకుంటున్న జిల్లా
శ్రీకాకుళం. మన రాష్ట్రంలో భౌగోళికంగా మొదటి లోక్‌సభ నియోజకవర్గం కూడా శ్రీకాకుళమే.
ఈ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి,
పాతపట్నం, శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట అనే ఏడు శాసనసభా నియోజకవర్గాలూ
శ్రీకాకుళం జిల్లా పరిధిలోనివే.
శ్రీకాకుళం లోక్‌సభా నియోజకవర్గం 1952లో ఏర్పడింది. అదే యేడాది జరిగిన
మొదటి ఎన్నికల్లో బొడ్డేపల్లి రాజేశ్వరరావు స్వతంత్ర అభ్యర్ధిగా గెలుపొందారు. ఆయనే
తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1957, 1962, 1971, 1977ల్లో కాంగ్రెస్ ఎంపీగా
విజయం సాధించారు. 1980లో కాంగ్రెస్ ఐ నుంచి పోటీ చేసి గెలిచారు. మధ్యలో 1967లో మాత్రం
స్వతంత్ర పార్టీ అభ్యర్ధి ఆచార్య ఎన్జి రంగా గెలుపొందారు. 1984లో తెలుగుదేశం
పార్టీ ఇక్కడ ఖాతా తెరిచింది. అయితే 1989, 1991లో జరిగిన ఎన్నికల్లో మళ్ళీ
కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించింది. 1996లో కింజరాపు యెర్రన్నాయుడు తెలుగుదేశం
తరఫున రంగప్రవేశం చేసారు. ఆయన 1996, 1998, 1999, 2004 ఎన్నికల్లో ఎంపీగా
ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో కిల్లి కృపారాణి కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు.
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన రెండు ఎన్నికలు 2014, 2019లో యెర్రన్నాయుడు
కుమారుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు విజయం సాధించారు.
2024
లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమి తరఫున తెలుగుదేశం అభ్యర్ధిగా రామ్మోహన్ నాయుడు
బరిలో నిలిచారు. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు.
ఆయనపై అధికార వైఎస్ఆర్సిపి పేరాడ తిలక్‌ను పోటీకి పెట్టింది. గతంలో పోటీ చేసిన
దువ్వాడ శ్రీనివాస్‌ను టెక్కలి శాసనసభకు మార్చింది. ఈ ప్రయోగం ఎంతమేరకు
ఫలిస్తుందన్నది వేచిచూడాల్సిందే.