Leftists Secularism: Ban on Ganapati Havan, Iftar in Govt
School
కేరళలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఇఫ్తార్ విందు
నిర్వహించడం వివాదాస్పదమైంది. కోళికోడ్ జిల్లా నెడుమన్నూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో
ఆ కార్యక్రమం జరిగింది. కొన్నివారాల క్రితం అక్కడ గణపతి హోమం జరపకుండా అడ్డుకున్నారు.
కానీ ఈ నెల 20న ఇఫ్తార్ విందు మాత్రం ఘనంగా నిర్వహించారు. దానిపై హిందూవర్గాలు
మండిపడుతున్నాయి.
నడువన్నూర్ గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్లో మార్చి
20వ తేదీన ఇఫ్తార్ విందు నిర్వహించారు. దాదాపు అందరు పాఠశాల పిల్లలూ ఆ కార్యక్రమంలో
పాల్గొన్నారు. ఆ సంఘటనపై స్థానిక హిందూసంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
దానికి కారణం ఉంది. ఫిబ్రవరి 13న అక్కడ ఓ కొత్త భవనం ప్రారంభోత్సవంలో గణపతి హోమం
నిర్వహించే ప్రయత్నాన్ని సీపీఎం కార్యకర్తలు, దాని అనుబంధ విద్యార్ధి సంస్థ
డివైఎఫ్ఐ కార్యకర్తలూ అడ్డుకున్నారు. పాఠశాలలో మతపరమైన కార్యక్రమం ఎలా చేస్తారంటూ
రచ్చ రచ్చ చేసారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తల ప్రభావంతో బడి నిర్వహిస్తున్న
కుటుంబం అక్కడ మతపరమైన కార్యక్రమాలు చేపట్టిందంటూ అల్లరి చేసారు. చివరికి పోలీసులు వచ్చి జోక్యం చేసుకుని గణపతి
హోమాన్ని ఆపివేయించారు.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే… అరుణ అనే మహిళ ఆ
పాఠశాల మేనేజర్. ఆమె తండ్రి స్థానిక కమ్యూనిస్టు నాయకుడు. అయినా తల్లీకూతుళ్ళు
మాత్రం హిందూ విశ్వాసాలు కలిగిన మహిళలు. ఇటీవల ఆ పాఠశాలలో ఒక కొత్త బ్లాక్
నిర్మించారు. ఆ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా గణపతి హోమం నిర్వహించాలని వారు
భావించారు. ఆ విషయం తెలిసిన సీపీఎం, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు అక్కడకు వెళ్ళి
గొడవ పెట్టారు. పాఠశాలలో ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యాపింపజేస్తున్నారనీ,
లౌకికవాదాన్ని అణగదొక్కేస్తున్నారనీ రచ్చ చేసారు.
స్కూల్ మేనేజర్ అరుణ ఆ ఆరోపణలను ఖండించారు. ఆ
రోజు తలపెట్టిన పూజ పూర్తిగా కుటుంబ వ్యవహారం తప్ప బాహ్య ప్రభావాలు ఏమీ లేవని
స్పష్టం చేసారు. ‘‘కొత్త భవనం నిర్మించిన సందర్భంగా పూజ చేస్తే మంచిదని మా అమ్మ
అనుకున్నారు. అందుకే పూజ నిర్వహించాం. నా తండ్రి కురుము వీట్టిల్ నాను ఇక్కడ
స్థానికంగా పేరున్న కమ్యూనిస్టు పార్టీ నాయకుడు. నేను పుట్టింది కమ్యూనిస్టు కుటుంబంలోనే.
అందువల్ల పార్టీ కార్యకర్తలు మమ్మల్ని లక్ష్యం చేసుకోవడం దురదృష్టకరం. మా నమ్మకాల
మేరకు గణపతి హోమం చేయించుకోవాలనుకున్నాం. అక్కడ నేను, నా కుటుంబ సభ్యులు మాత్రమే
ఉన్నాం’’ అని అరుణ స్పష్టం చేసారు.
‘‘పాఠశాల భవనానికి ఏదో దోషం ఉందని ఆ కుటుంబం
భావించింది, అందుకే పూజ చేయించాలని వారు భావించారు. అంతేతప్ప అందులో ఆర్ఎస్ఎస్
లేదా బీజేపీ కార్యకర్తల ప్రమేయం ఏమీ లేదు. ఏదేమైనా, సీపీఎం, డీవైఎఫ్ఐ కార్యకర్తలు
హోమం జరగకుండా అడ్డుకున్నారు’’ అని స్థానిక సబ్-ఇనస్పెక్టర్ చెప్పారు.
సీపీఎం మాత్రం ఆ కుటుంబానికి బీజేపీతో
సంబంధాలున్నాయి అని వాదిస్తోంది. అరుణ కుమారుడే స్థానిక బీజేపీ కార్యకర్తలతో కలిసి
పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడనీ వారు ఆరోపించారు.
ఆ సంఘటనపై కున్నుమ్మాళ్ అసిస్టెంట్ ఎడ్యుకేషనల్
ఆఫీసర్ కె అబ్దుల్ ఖాదర్, స్థానిక డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సి మనోజ్కుమార్కు
నివేదిక అందజేసాడు. ఆయన దాన్ని విద్యాశాఖ మంత్రికి, శాఖ డైరెక్టర్కూ పంపించాడు.
అందులో అబ్దుల్ ఖాదర్, ఆరోజు జరిగిన ఘటనను వివాదాస్పదంగానూ, పాఠశాల యాజమాన్యం
వైఫల్యంగానూ చిత్రీకరించాడు. పాఠశాల
ప్రధానోపాధ్యాయినికి తెలియకుండానే మతపరమైన కార్యక్రమాలు నిర్వహించారని ఆరోపించాడు.
అరుణ ఫిబ్రవరి 15న వివరణ ఇవ్వాలి, డీడీఈ కార్యాలయంలో ప్రత్యక్షంగా కానీ లేదా
ఇమెయిల్ ద్వారా కానీ వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించాడు.
అలాంటిది ఇప్పుడు, అంటే మార్చి 20న అదే పాఠశాలలో
ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసారు. అప్పుడు మాత్రం ఎవరికీ అది మతపరమైన కార్యక్రమంగా
అనిపించలేదు. రంజాన్ సందర్భంగా ముస్లిములు మాత్రమే అన్నిరకాల ఆహార పదార్ధాలతోనూ ఇఫ్తార్
విందు చేసినా అది లౌకికవాదానికి భంగకరం అని వారెవ్వరికీ అనిపించలేదు. ఆ ద్వంద్వ
వైఖరిని హిందూ సంస్థలు చిత్రీకరించాయి. ఆ ఫొటోలను ప్రచారంలోకి తెచ్చాయి.
కమ్యూనిస్టుల లెక్కలో గణపతి హోమం మతపరమైన
కార్యక్రమం, ఇఫ్తార్ విందు మాత్రం లౌకికవాదం అంటూ హిందూ సంస్థలు మండిపడుతున్నాయి.