Calcutta HC orders to hand Sheikh Shahjahan over to CBI,
Bengal Govt rushes to SC
పశ్చిమబెంగాల్లోని సందేశ్‌ఖాలీలో హిందూమహిళలపై
అత్యాచారాలు సహా పలు ఆర్థిక నేరాలకు పాల్పడి, 43 కేసుల్లో నిందితుడిగా ఉన్న
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు షేక్ షాజహాన్‌ను సీబీఐకి అప్పగించాలని కలకత్తా హైకోర్టు ఆ
రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు బెంగాల్ పోలీసులు ఇవాళ సాయంత్రం
4.30లోగా అన్ని కేసుల సమాచారంతో సహా షాజహాన్ని సీబీఐకి అప్పగించాల్సి ఉంది.
హైకోర్టు ఉత్తర్వులు వచ్చిన కొద్ది క్షణాల్లోనే
బెంగాల్ ప్రభుత్వం ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే
తమ పిటిషన్‌ను తక్షణమే విచారించాలన్న బెంగాల్ ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు
తిరస్కరించింది. నియమ నిబంధనలను బట్టే నడుచుకుంటామని చెబుతూ, పిటిషన్‌ను రిజిస్ట్రార్
జనరల్ ముందు మెన్షన్ చేయాలని బెంగాల్ ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సీనియర్
న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి
సూచించింది.
తొలుత సీబీఐ, రాష్ట్రపోలీసులతో ఉమ్మడిగా ప్రత్యేక
దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే ఆ ఆదేశాన్ని
కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని బెంచ్
త్రోసిపుచ్చింది. కేసును సీబీఐకి బదిలీ చేసింది.
ఉమ్మడి దర్యాప్తు బృందం ఏర్పాటు ఆదేశాలను ఈడీ,
రాష్ట్రప్రభుత్వం రెండూ వ్యతిరేకించాయి. కేసును పూర్తిగా సీబీఐకే అప్పగించాలని ఈడీ
కోరింది, పూర్తిగా బెంగాల్ పోలీసులకే అప్పగించాలని తృణమూల్ ప్రభుత్వం కోరింది. దాంతో
హైకోర్టు ఈడీకి అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది.
ఈ యేడాది మొదట్లో బెంగాల్లో ఒక కుంభకోణానికి
సంబంధించిన విచారణ కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సందేశ్‌ఖాలీ
వెళ్ళడానికి ప్రయత్నించారు. అప్పుడు షాజహాన్ షేక్, అతని అనుచరులు ఈడీ అధికారులపై
దాడి చేసారు. దాంతో అతన్ని అరెస్ట్ చేయడానికి ఈడీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ
క్రమంలో షాజహాన్ షేక్, అతని అనుచరులు ఆ ప్రాంతంలోని హిందూ మహిళలపై తృణమూల్
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారాల తరబడి సామూహిక అత్యాచారాలకు పాల్పడేవారన్న
విషయం బైటపడింది. అది మరింత పెద్ద వివాదానికి దారి తీసింది.
ఆ నేపథ్యంలో జనవరి 5
నుంచీ షాజహాన్ షేక్ 55 రోజుల పాటు పరారీలో ఉన్నాడు. ఈడీ కోరినా పట్టించుకోని
రాష్ట్ర పోలీసులు, హైకోర్టు జోక్యం చేసుకున్నవెంటనే షాజహాన్‌ను మూడు రోజుల్లో
అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టారు. తప్పని పరిస్థితుల్లో మమతా బెనర్జీ
పార్టీ అతన్ని ఆరేళ్ళ పాటు సస్పెండ్ చేసింది. అయినా ఇప్పటికీ అతన్ని రక్షించడానికి
ప్రయత్నిస్తూనే ఉంది. ఆ క్రమంలోనే సీబీఐకి అప్పజెప్పవద్దంటూ సుప్రీంకోర్టును
ఆశ్రయించింది.