ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో విద్యార్ధుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, వామపక్ష మద్దతు గ్రూపుల మధ్య చెలరేగిన ఘర్షణల్లో ముగ్గురు విద్యార్థులు గాయపడ్దారని పోలీసులు తెలిపారు. త్వరలో విద్యార్ధుల సంఘం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి జరిగిన సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యార్ధుల దాడులతో యూనివర్శిటీలో ఘర్షణ వాతావరణం నెలకొంది.
యూనివర్శిటీలోని స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్‌లో ఎన్నికల కమిటీ సభ్యుల ఎంపిక జరిగే క్రమంలో విద్యార్ధుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. గాయపడిన విద్యార్థులను సమీపంలోని సప్థర్‌జంగ్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఘర్షణలపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్, లిటరేచర్ అండ్ కల్చరల్ స్టడీస్ విద్యార్థులపై జరిగిన దాడిని పలువురు ఏబీవీపీ నాయకులు ఖండించారు.