సందేశ్‌ఖాలీలో మహిళలపై వేధింపులు,
భూ కబ్జాలకు పాల్పడిన కేసులో నిందితుడు, ఈడీ అధికారులపై దాడి కేసులో
అరెస్టైన టీఎంసీ నేత షాజహాన్ పై ఆ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. పార్టీ
నుంచి ఆరేళ్ళ పాటు సస్పెండ్ చేసింది.
సందేశ్ ఖాలీలో
షాజహాన్ బలమైన నేత. టీఎంసీ విభాగ అధ్యక్షుడిగా ఉన్న షేక్ షాజహాన్, స్థానిక ఎంపీ,
ఎమ్మెల్యేల కంటే ఎక్కువ బలమైన నేతగా ఉన్నారు.
1999 లో కూలీగా తర్వాత కూరగాయల
విక్రేతగా జీవితాన్ని గడిపిన షాజహాన్, ఆ తర్వాత సీపీఎంలో చేరారు. ఆ పార్టీలో
కొనసాగుతూ అనేక చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఉద్యోగాల కల్పన పేరిట యువతను చెప్పుచేతల్లో పెట్టుకున్న షాజహాన్, శుభకార్యాల
సమయంలో ఆర్థిక సాయం చేయడం ద్వారా స్థానికులకు దగ్గరయ్యారు.
2013లో టీఎంసీలో
చేరి మాజీ మంత్రి జ్యోతిప్రియో మాలిక్ పంచన చేరారు. రేషన్ కుంభకోణంలో మాలిక్ అరెస్ట్
అయ్యారు. ఈ కేసులో సోదాలకు వచ్చిన అధికారులపై షాజహాన్ అనుచరులు దాడి చేశారు.
అప్పటి నుంచి షాజహాన్ తప్పించుకు తిరుగుతున్నాడు. నేటి ఉదయం పోలీసులకు చిక్కాడు.
స్థానికుల నుంచి
భూములు లాక్కోవడంతో పాటు అతడి అనుచరులు మహిళలపై లైంగికదాడులకు పాల్పడ్డారని,
అపహరించారని కేసు నమోదైంది.
షాజహాన్
కు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరఫు న్యాయవాది
చేసిన వినతి సందర్భంగా కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్
శివజ్ఞానం కీలక వ్యాఖ్యలు చేశారు. షాజహాన్ విషయంలో సానుభూతి లేదన్నారు.
షాజహాన్
కు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరఫు న్యాయవాది కోరగా ప్రధాన న్యాయమూర్తి
తిరస్కరించారు. పిటిషన్ ను సోమవారం విచారిస్తామన్నారు.
షాజహాన్
పై 43 కేసులు ఉన్నాయని ఆయన తరఫున వకాల్తా పుచ్చుకునే న్యాయవాది వచ్చే పదేళ్ళు
బిజీగా ఉంటారని వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వంపై ఉపముఖ్యమంత్రి డ్రగ్స్ వ్యాఖ్యల కలకలం