ఖలిస్తానీ
వేర్పాటువాదులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కెనడా ప్రభుత్వ తీరును భారత విదేశాంగ శాఖ
మంత్రి జై శంకర్ మరోసారి తూర్పార బట్టారు. కెనడాలో గత ఏడాది భారత దౌత్యాధికారులకు వరుస
బెదిరింపులు వచ్చాయని తెలిపిన జై శంకర్, ఆ సమయంలో కెనడా వ్యవస్థల నుంచి భారత్కు
ఎలాంటి సహకారం లభించలేదన్నారు. అందుకే కెనడాకు వీసా జారీని నిలిపివేసినట్లు
వివరించారు.
ఖలిస్తానీ
తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత ఏజెంట్లే కారణమని కెనడా ప్రధాని
జస్టిన్ ట్రూడో ఆరోపించగా, భారత్ తిప్పికొట్టింది. దీంతో ఇరుదేశాల మధ్య దౌత్య
సంబంధాలు దెబ్బతిన్నాయి. అప్పుడు తలెత్తిన అంశాలను జైశంకర్ తాజాగా జరిగిన ఓ సమావేశంలో వివరించారు.
కెనడాలో
భారత దౌత్యాధికారులను బెదిరించిన వారితో పాటు శాన్ఫ్రాన్సిస్కోలో భారత
కాన్సులేట్, లండన్ లోని భారత హైకమిషనర్ మీద దాడికి పాల్పడిన వారిపై చర్యలు
తీసుకోవాలని జై శంకర్ డిమాండ్ చేశారు.
ఇతర
దేశాల ప్రతినిధులను బెదిరించే స్థాయికి వాక్ స్వేచ్ఛ విస్తరించడం సరికాదని హితవు
పలికారు.
యూకే,
యూఎస్, ఆస్ట్రేలియాలోనూ దాడులు జరిగినప్పుడు కూడా తగినంత భద్రత లభించలేదన్న
జైశంకర్, ప్రస్తుతం పరిస్థితులు చక్కబడ్డాయన్నారు. ఒక దేశ రాయబార కార్యాలయాలపై
దాడులు జరిగినప్పుడు స్థానిక ప్రభుత్వాల నుంచి స్పందన లేకపోవడం తప్పుడు సంకేతాలను
పంపుతుందన్నారు.