తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ రైతులు చేపట్టిన చలో ఢిల్లీ (chalo delhi farmers protest) కార్యక్రమం కొనసాగుతోంది. రైతులతో నిరసన విరమింపజేసేందుకు రైతు సంఘాల నాయకులతో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా బుధవారం రాత్రి వరకూ చర్చలు జరిపారు. గురువారం సాయంత్రం చర్చలు కొనసాగించనున్నారు. అయితే ఇప్పటికే వేలాదిగా ఢిల్లీ వైపుగా కదులుతోన్న రైతులను నిలువరించేందుకు పోలీసులు, భద్రతా బలగాలు బాష్ఫవాయుగోళాలు ప్రయోగిస్తున్నాయి. ఢిల్లీ సరిహద్దులో బలగాలు ఏర్పాటు చేసిన బారికేడ్లు, ఇనుపకంచెలను రైతులు ధ్వంసం చేస్తున్నారు. రైతులను చెదరగొట్టేందుకు సోనిక్ యంత్రాలతో భారీ శబ్ధాలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.
బాష్పవాయుగోళాల నుంచి రక్షణ కోసం రైతులు నీటి ట్యాంకులు సిద్దం చేసుకున్నారు. బాష్పవాయుగోళాలు ప్రయోగించగానే వెంటనే నీటితో ఆర్పివేస్తున్నారు. రైతులు అనేక రక్షణ చర్యలు పాటిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. శరీర రక్షణ, కళ్ల రక్షణకు పరికరాలు ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.
రైతుల ఆందోళనలు విస్తరించకుండా కేంద్ర చర్యలు చేపట్టింది. హర్యానాలోని అంబాలా, కైతాల్, జింద్, కురుక్షేత్ర, ఫతేహాబాద్, సిర్సా జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. కేవలం వాయిస్ కాల్స్‌కు మాత్రమే అనుమతించారు.
డ్రోన్ల ద్వారా బాష్పవాయుగోళాలు ప్రయోగించడంపై పంజాబ్ ప్రభుత్వ పోలీసు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. హర్యానా సరిహద్దుల్లోని పంజాబ్‌లో డ్రోన్లు ఎగురవేయడంపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అంబాలా డిప్యూటీ కమిషనర్ పటియాలా డిప్యూటీ కమిషనర్ షోకత్ అహ్మద్ పర్రేకు పిర్యాదు లేఖలు అందించారు. శంభు సరిహద్దులో డ్రోన్లు ఎగురవేయవద్దని సూచించారు.
ఇవాళ సాయంత్రం మరో దఫాా చర్చలు
ముగ్గురు కేంద్ర మంత్రులు, 200 రైతు సంఘాల నాయకులతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే మూడు దఫాలు చర్చలు జరిగాయి. గురువారం సాయంత్రం 5 గంటలకు మరోసారి చర్చలు జరపనున్నారు. రైతు సంఘాలు ప్రధానంగా 12 డిమాండ్లు చేస్తున్నాయి. వాటిల్లో కొన్నింటికి కేంద్రం అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే వెంటనే మద్దతు ధరపై చట్టం చేయాలంటూ రైతు సంఘాలు చేస్తున్న డిమాండ్‌పై కేంద్రం హామీ ఇవ్వలేదు. ఇప్పటికిప్పుడు చట్టం చేయడం సాధ్యకాదని కేంద్ర మంత్రులు చెప్పినా, రైతు సంఘాల నాయకులు వెనక్కు తగ్గడం లేదు.
ఢిల్లీలో ట్రాఫిక్ అరాచకం
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలతో జనం అల్లాడిపోతున్నారు. ఇప్పటికే ఢిల్లీ అంతటా 144 సెక్షన్ అమలవుతోంది. సరిహద్దులు మూసివేయడంతో భారీ ట్రక్కులు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర రహదారులపై వాహనాలు బారులు తీరాయి. బహదూర్గఢ్ మార్గంలోని టిక్రీ సరిహద్దులను కూడా పోలీసులు మూసివేశారు.