హమాస్ ఉగ్రవాదులు అల్ షిఫా ఆసుపత్రి కింద సొరంగాల్లో బందీలను దాచారంటూ ఇజ్రాయెల్ చేస్తోన్న ఆరోపణలకు బలం చేకూరింది. ఐడీఎఫ్ అల్ షిఫా ఆస్పత్రిని స్వాధీనం చేసుకుంది. ఆస్పత్రి కింద సొరంగాల్లో హమాస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన బందీలకు చెందిన వీడియోను ఐడీఎఫ్ విడుదల చేసింది. ఇప్పటి వరకు హమాస్ ఉగ్రవాదులు పాఠశాలలు, ఆస్పత్రుల కింద సొరంగాలు ఏర్పాటు చేసుకుని దాడులకు తెగబడుతున్నారంటూ ఐడీఎఫ్ చేస్తోన్న వాదనలకు ఈ వీడియో సాక్ష్యంగా నిలిచింది.
అక్టోబరు 7న హమాస్ ఉగ్రవాదులు, ఇజ్రాయెల్‌పై (Israel hamas war) మెరుపు దాడులకు దిగిన సమయంలో అల్ షిఫా ఆస్పత్రి సీసీ కెమెరాల్లో రికార్డైన వీడియోలను ఐడీఎఫ్ విడుదల చేసింది. ఓ వ్యక్తిని హమాస్ ఉగ్రవాదులు బలవంతంగా లోపలికి లాక్కొస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. తీవ్రంగా గాయపడిన బందీని ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్‌లోకి లాక్కెళుతోన్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపించాయి.
హమాస్ చెరలోని బందీలు నేపాల్, థాయ్‌లాండ్ దేశస్థులని ఐడీఎఫ్ ప్రకటించింది. ప్రస్తుతం హమాస్ చెరలోని బందీల పరిస్థితి ఎలా ఉంది? వారు ఎక్కడ ఉన్నారనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఇజ్రాయెల్‌పై అక్టోబరు 7న దాడి చేసిన సమయంలో హమాస్ ఉగ్రవాదులు అల్ షిఫా ఆస్పత్రిని ఉపయోగించుకున్నారని ఐడీఎఫ్ స్పష్టం చేసింది.
అల్ షిఫా ఆస్పత్రి కింద 10 మీటర్ల లోతులో 55 మీటర్ల భారీ సొరంగాలను ఐడీఎఫ్ గుర్తించింది.అయితే సొరంగంలో ఏముంది అనే విషయం ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించలేదు.