ఇజ్రాయెల్,
హమాస్ మధ్య యుద్ధకాండ ఇప్పట్లో ముగిసేలా లేదు. హమాస్ మూలాలు పెకిలించడమే లక్ష్యంగా
గాజా పై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతోంది. సామాన్యులను రక్షణకవచాలుగా
ఉపయోగించుకుంటూ హమాస్ దళాలు కూడా దాడులకు పాల్పుడుతున్నాయి. దీంతో ఇరువర్గాల
భీకరదాడులతో సామాన్య ప్రజానీకం అల్లాడుతున్నారు. తమగోడు ఆలకించాలంటూ
రోదిస్తున్నారు.
బందీల
విడుదల, యుద్ధ విరమణకు సంబంధించి గాజాతో ఎలాంటి ఒప్పందం జరగలేదుని ఇజ్రాయెల్ తో
పాటు అమెరికా తెలిపింది.
50
మంది బందీలను విడుదల చేస్తే ఐదు రోజులపాటు దాడులకు విరామం ఇస్తామని ఇజ్రాయెల్,
అమెరికాలు హమాస్ తో ఒప్పందానికి వచ్చినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
దీనిపై స్పందించిన అమెరికా, ఇజ్రాయెల్ అలాంటిదేమీ లేదని స్పష్టం చేశాయి.
ఈ ప్రతిపాదనకు ఖతర్ దేశం మధ్యవర్తిత్వం
చేసినట్లు కథనాల్లో పేర్కొనగా ప్రతీ 24 గంటల వ్యవధిలో విడతల వారీగా విడుదల
చేసేందుకు సుమఖత వ్యక్తమైనట్లు వార్తలొచ్చాయి.
హమాస్
దళాల వద్ద దాదాపు 240 మంది బందీలుగా ఉన్నట్లు సమాచారం. మహిళలు, చిన్నారులు కూడా
బాధితులు జాబితాలో ఉన్నారు. ఇజ్రాయెల్ లోని నగరాలపై దాడులకు పాల్పడిని హమాస్ దళాలు,
కొంతమంది పౌరులను బందించి అపహరించాయి.
హమాస్ దాడుల కారణంగా 1200 ఇజ్రాయెల్ ప్రజలు
ప్రాణాలు కోల్పోయారు. హమాస్ చర్యలకు ఇజ్రాయెల్ కూడా ప్రతిదాడులు ప్రారంభించగా
బందీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
బందీల
విడుదలకు సంబంధించి ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్
నెతన్యాహు, హమాస్ చెర నుంచి తమవారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు తీవ్రంగా
ప్రయత్నిస్తున్నామన్నారు. దీనిపై మరింత వివరణ ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు.
ఇప్పటి
వరకు ఎలాంటి రాజీ ఒప్పందం కుదరలేదని, దాని కోసం కృషి చేస్తున్నామని వైట్ హైస్
అధికారులు ఓ ప్రకటనలో వివరణ ఇచ్చారు.
ఇజ్రాయెల్
చేస్తోన్న ప్రతిదాడులపై అంతర్జాతీయంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సామాన్యులకు
నష్టం వాటిల్లే చర్యలు నిలిపివేయాలని పలు దేశాలు సూచిస్తున్నాయి. యుద్ధం కారణంగా
ఇప్పటివరకు ఇరు దేశాలకు చెందిన 11 వేల మంది చనిపోయారు.