ఇరాన్ పార్లమెంట్ హిజాబ్, పవిత్రత బిల్లును ఆమోదించింది. తప్పనిసరిగా మహిళలు ముఖం కనిపించకుండా దుస్తుల ధరించాలనే కోడ్ ఉల్లంఘనకు పాల్పడితే జరిమానాలు, జైలు శిక్షలతో సహా పలు శిక్షలు ఉంటాయని బిల్లులో వివరించారు.మూడేళ్ల పాటు ఈ బిల్లు అమల్లో ఉంటుంది. ఈ బిల్లుకు ఇరాన్ పార్లమెంటులో 152 మంది సభ్యులు అనుకూలంగా ఓటేయగా, 34 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ఏడుగురు సభకు హాజరుకాలేదు. సభలో ఈ బిల్లు ప్రవేశపెట్టే ముందే మతాధికారులు, గార్డియన్ కౌన్సిల్, న్యాయ నిపుణులతో కూడిన కమిటీ హిజాబ్‌ను ఆమోదించింది. హిజాబ్ అమలును ప్రయోగాత్మకంగా అమలుకు కమిటీ ఆమోదించింది. ఇరాన్ పార్లమెంటు కేవలం దీని కాల వ్యవధిని మాత్రమే నిర్ణయించింది.
తాజాగా తీసుకువచ్చిన డ్రెస్ కోడ్ ప్రకారం మహిళలు ముఖాలను బహిర్గతం చేయడం, బిగుతు దుస్తులు ధరించడం, మెడ కంటే దిగువన, చీల మండలపైన, ముంజేతులపై భాగాలను చూపించే విధంగా దుస్తులు ధరించరాదు. పురుషులు ఛాతీ కంటే దిగువన, చీలమండలు, భుజాలపైన శరీర భాగాలను చూపించే విధంగా దుస్తులు ధరించడాన్ని బహిష్కరించారు.
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో హజాబ్కు వ్యతిరేకంగా పోరాడుతూ పోలీసు కస్టడీలో మరణించిన మహసా అమినీ మరణించిన మొదటి వార్షికోత్సవం జరిగిన కొద్ది రోజులకే ఈ బిల్లుకు ఆమోదం తెలపడం గమనార్హం. డ్రెస్ కోడ్ ఉల్లంఘించిందనే ఆరోపణలపై అరెస్టై, కస్టడీలో అమినీ మరణించిన తరవాత ఇరాన్లో పెద్ద ఎత్తున నిరసనలు పెల్లుబికాయి. ఇందులో వందలాది మంది మరణించారు.
బుర్ఖాలు ధరించడంపై నిషేధం బిల్లుకు స్విట్జర్లాండ్ దేశ దిగువ సభ ఆమోదం తెలిపింది.బుర్ఖా ధరించిన వారిపై రూ.91450 జరిమానా విధిస్తారు.ఈ బిల్లుకు ఇప్పటికే ఎగువ సభలో ఆమోదం లభించింది. ఉభయ సభల్లో బిల్లుకు ఆమోదం లభించడంతో బహిరంగ ప్రదేశాలు, ప్రైవేటు భవనాల్లోనూ బుర్ఖాలపై నిషేధం అమల్లోకి వచ్చినట్టైంది.
కర్ణాటకలోనూ హిజాబ్ వివాదం చెలరేగి, అది దేశ వ్యాప్త నిరసనలకు దారితీసిన సంగతి తెలిసిందే. దీనిపై కర్ణాటక హైకోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించింది. బుర్ఖాలు ధరించడం తప్పనిసరి కాదని తేల్చి చెప్పింది. ఇస్లాం ప్రకారం బుర్ఖాలు ధరించడం తప్పనిసరి కాదని కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై ముస్లిం మత పెద్దలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.