స్కిల్
డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు
చెప్పింది. చంద్రబాబును అయిదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరగా న్యాయమూర్తి
రెండ్రోజుల విచారణకు అనుమతించారు.
రాజమహేంద్రవరం
జైలులోనే చంద్రబాబును విచారణ చేయాలని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అంతకు ముందు చంద్రబాబు రిమాండ్ ను ఏసీబీ కోర్టు పొడిగించింది. ఈ నెల 24 వరకు జ్యడీషియల్
రిమాండ్ పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో
అరెస్టై జైలులో ఉన్న చంద్రబాబును పోలీసులు వర్చువల్ గా ఏసీబీ కోర్టులో హాజరు
పరిచారు.
రిమాండ్
సమయం ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. ఈ సందర్భంగా చంద్రబాబు అభిప్రాయాన్ని
న్యాయమూర్తి కోరారు. జైలులో ఉంచి మానసిక క్షోభకు గురిచేస్తున్నారని చంద్రబాబు
న్యాయమూర్తికి చెప్పారు. తన హక్కులను రక్షించాలని కోరారు.
అనంతరం
చంద్రబాబుతో మాట్లాడిన న్యాయమూర్తి, ‘‘ మీరు పోలీసు కస్టడీలో లేరు, జ్యుడిషియల్
కస్టడీలో ఉన్నారు. దీనిని శిక్షగా భావించొద్దు, మీపై వచ్చినవి ఆరోపణలు మాత్రమే’’ అన్నారు.
చట్టం నిబంధనల ప్రకారమే రిమాండ్ విధించామన్నారు.