గ్రహాంతరవాసుల
అవశేషాలంటూ మెక్సికో పార్లమెంట్లో ఓ పరిశోధక జర్నలిస్ట్ అందజేసిన నమూనాలపై
నాసా స్పందించింది. సంబంధిత శిలాజాలకు
సంబంధించి తమ వద్ద నమూనాలు అందుబాటులో లేవని, సరైన, శాస్త్రీయ పరీక్షలు జరపకుండా
అవేంటో నిర్ధారణకు రాలేమని తెలిపింది.
ఇలాంటి
అసాధారణ వస్తువులు, ఇతరత్రా ఆబ్జెక్ట్స్ ఏవైనా గుర్తించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా
ఉన్న శాస్త్రవేత్తలు, పరిశోధకులకు నమూనాలు పంపించాలని నాసా యూఏపీ డైరెక్టర్ డేవిడ్
స్పెర్గల్ చెప్పారు. అసాధారణ విషయాల్లో పూర్తి పారదర్శకత అవసరమని వాటి ఫోటోలను
సోషల్ మీడియాలో చూడటమే తప్ప ఎలాంటి అదనపు
సమాచారం తెలియదని చెప్పారు.
అన్
ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్టు గా వ్యవహరించే అన్ ఐడెంటిఫైడ్ అనోమోలస్ ఫెనామెనన్లపై నాసా తాజాగా ఓ కొత్త నివేదికను విడుదల చేసింది.
దీనిపై సాధారణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా కమిటీ వేసినట్లు స్పష్టం
చేసింది. ప్రిన్స్టన్ యూనివర్సిటీ ఆస్ట్రోఫిజిక్స్ డిపార్ట్మెంట్ మాజీ హెడ్
డేవిడ్ స్పెర్గల్ ను ఈ కమిటీ డైరెక్టర్ గా నియమించింది.
మెక్సికన్
జర్నలిస్ట్, ఏలియన్స్ ఉనికిపై పరిశోధనలు నిర్వహిస్తున్న జైమ్ మౌసాన్ , ఆ దేశ చట్ట
సభలో రెండు చిన్నసైజు వింత అస్థిపంజరాలను ప్రదర్శించారు. వాటి చేతులకు మూడు వేళ్ళు
మాత్రమే ఉండటంతో పాటు తల భాగం పెద్దదిగా పొడవుగా ఉంది.
పెరూలోని
పురాతన నజ్కా ఎడారి ప్రాంతం నుంచి వీటిని సేకరించినట్లు తెలిపారు. కార్బన్ డేటింగ్
విధానం ద్వారా వీటి వయస్సు వెయ్యి ఏళ్ళుగా లెక్కగట్టారు.
ఈ నమూనాలు మావవేతరులవని డీఎన్ఏ పరీక్షలో
స్పష్టమైందని, ప్రపంచంలో వేటికి అవి సరిపోలడం లేదని వివరించారు. కాబట్టి గ్రహాంతర
వాసుల ఉనికిని విశ్వసించాలని కోరారు.